మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అమెరికా బాక్సాఫీస్ వద్ద ఇప్పుడే మెగా ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ-సేల్స్‌లో 200 వేల డాలర్ల మార్కును ఈ చిత్రం సునాయాసంగా దాటేసింది. చిరంజీవి గారి సినిమాలకు ఓవర్సీస్‌లో, ముఖ్యంగా అమెరికాలో ఎప్పుడూ భారీ ఆదరణ ఉంటుంది.


ప్రేక్షకుల నుండి వస్తున్న విపరీతమైన స్పందనను చూసి, అక్కడి డిస్ట్రిబ్యూటర్లు మరిన్ని స్క్రీన్లను పెంచుతున్నారు. పెద్ద తెరపై సినిమాను చూసేందుకు వీలుగా ఇవాళ్టి నుండి XD  ఫార్మాట్ షోలను కూడా యాడ్ చేస్తున్నారు. జనవరి 11న నిర్వహించే ప్రీమియర్ షోలకే ఈ స్థాయిలో వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిరంజీవి గారి వింటేజ్ టైమింగ్‌ను గుర్తుకు తెచ్చేలా రూపొందింది.


ఒక రిటైర్డ్ ఏజెంట్ తన కుటుంబం కోసం తిరిగి యాక్షన్‌లోకి దిగడం అనే అంశానికి వినోదాన్ని జోడించి ఈ కథను తీర్చిదిద్దారు. చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ఒక పవర్ ఫుల్ మరియు వినోదాత్మకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. సినిమా నిడివిని 2 గంటల 42 నిమిషాలుగా ఖరారు చేశారు.


భీమ్స్ సిసిరోలియో అందించిన ‘మీసాల పిల్ల’, ‘శశిరేఖ’ మరియు చిరు-వెంకీల ‘మెగా విక్టరీ’ సాంగ్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మెగాస్టార్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో, వింటేజ్ గ్రేస్‌తో చూపించబోతున్నామని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ వాతావరణానికి పక్కాగా సరిపోయే ఈ చిత్రం అమెరికాలో 1 మిలియన్ డాలర్ల ప్రీమియర్ వసూళ్లను సాధించే దిశగా దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: