హిందీ మార్కెట్‌లో ‘రాజాసాబ్’ సినిమాకు జరిగిన ప్రచార లోపమే ఈ తక్కువ వసూళ్లకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా యూనిట్ అక్కడ పక్కా ప్రణాళికతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంలో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ప్రభాస్ ఒక్క ప్రమోషనల్ ఈవెంట్‌లో కూడా పాల్గొనకపోవడం ఉత్తరాది అభిమానులను నిరాశకు గురిచేసింది. మొక్కుబడిగా నిర్వహించిన ప్రెస్ మీట్‌కు చిత్రంలో విలన్‌గా నటించిన సంజయ్ దత్ కూడా హాజరుకాకపోవడం గమనార్హం. సినిమా ప్రోమోలు సైతం హిందీ ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో థియేటర్ల వద్ద సందడి కరువైంది.
బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్‌లో అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. కేవలం రూ. 6 కోట్ల ప్రారంభ వసూళ్లతో మొదలైన ఈ చిత్రం వీకెండ్ ముగిసే సరికి రూ. 16 - 17 కోట్లకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా టాక్ ఆశాజనకంగా లేకపోవడంతో పాటు మొదటి రోజు తర్వాత వసూళ్లు ఏమాత్రం పుంజుకోకపోవడం ప్రభాస్ హిందీ మార్కెట్ పై ప్రభావం చూపుతోంది. సాధారణంగా ప్రభాస్ సినిమాలు నెగిటివ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లను రాబట్టేవి. గతంలో ‘సాహో’ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ హిందీలో రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఘనత ఆయనది.
కానీ ‘రాజాసాబ్’ విషయంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ చిత్ర మొత్తం వసూళ్లు రూ. 20-25 కోట్ల మధ్యే నిలిచిపోయే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్ వంటి మాస్ హీరోకి ఇవి చాలా తక్కువ గణాంకాలు. రాజస్థాన్, బీహార్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ హారర్ కామెడీ ప్రభావం చూపలేకపోయింది. రాధేశ్యామ్ వంటి క్లాస్ మూవీకి వచ్చిన స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రాకపోవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ‘రాజాసాబ్’ ఫలితం ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దక్షిణాదిలో కొంత ప్రభావం చూపినప్పటికీ హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ కథతో ఏమాత్రం కనెక్ట్ కాలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి