సంచలనం సృష్టించిన అమితాబ్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' ఆరో సీజన్‌లో పంజాబీ మహిళ సన్‌మీత్‌కౌర్ సాహ్నీ ఐదు కోట్ల రూపాయల మెగా బహుమతిని గెలుచుకుని దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ బంపర్‌ప్రైజ్ గెలుచుకున్న మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ''కంప్యూటర్‌ జీ... లాక్ కీజియే...'' అంటూ ఖంగుమనే కంఠంతో,  పులిలాంటి చూపుతో... ఉద్వేగభరితంగా అమితాబ్... 'ఆప్‌కీ జవాబ్ సహీ హై'.. అంటూ స్వయంగా లేచి వచ్చి ఆమెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ వచ్చే వారం ప్రసారం కానుంది. తనకు బహుమతిగా వచ్చే సొమ్ములో కొంత భాగాన్ని పంజాబీ సంప్రదాయ కార్యక్రమాలకు దానం చేస్తానని, మిగిలిన మొత్తం ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తామని 37 ఏళ్ల సాహ్నీ తెలిపారు. పంజాబ్‌లోని చండీగఢ్‌లో పుట్టి... కొన్నేళ్లుగా ముంబైలో ఇళ్ల వద్ద ప్రైవేట్లు చెబుతున్న సాహ్నీ... హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు ధరించే వ్యక్తిని పెళ్లాడి... కొన్నేళ్ల క్రితమే ముంబైకి వచ్చారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. ముందుగా అమితాబ్, తరువాత తన భర్త వచ్చి చెప్పడంతో తనకే జాక్‌పాట్ వచ్చిందని నమ్మానని సాహ్నీ తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన కేబీసీలో తొలుత కోటి రూపాయలు మాత్రమే బహుమతిగా ఇచ్చేవారు. తర్వాత దాన్ని రెట్టింపు చేసినా, నాలుగో సీజన్ నుంచి మామూలు బహుమతిని కోటి రూపాయలుగానే ఉంచి... ఐదు కోట్ల రూపాయల జాక్‌పాట్ అదనంగా చేర్చారు. తొలిసారిగా బీహార్‌కు చెందిన సుశీల్‌కుమార్ ఈ ఐదుకోట్ల బంపర్ బహుమతిని సాధించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: