అమెరికాకు కాబోయే  అధ్యక్షుడు బిడెన్ మరో  రెండు రోజుల్లో అధ్యక్షుడిగా  ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఎంతో వైభవంగా బిడెన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో అమెరికన్స్ చూడని అద్భుతమైన పాలన అందిస్తానని అందుకోసమే ఎంతో నైపుణ్యం కలిగిన టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాని చెప్పిన బిడెన్ అన్నట్టుగానే సుమారు 100 మందితో అన్ని శాఖలను అనుసంధానిస్తూ పటిష్టమైన టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ 100 మందిలో దాదాపు 20 మంది భారతీయులు ఉండటం అందరిని ఆశ్చర్యపరిచింది.
త్వరలో ఏర్పడనున్న ప్రభుత్వంలో ఏకంగా 20 కీలక బాధ్యతలు బిడెన్ భారతీయులకు మాత్రమే అప్పగించాడు. అమెరికాలో ఒక్క శాతం ఉన్న భారతీయులకు ఈ స్థాయిలో బాధ్యతలు అప్పగించడం ఇదే ప్రధమమని , అమెరికా ప్రభుత్వ చరిత్రలో  ఇంతమంది భారతీయులు పనిచేయడం ఎన్నడూ జరగలేదని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే భారత సంతతికి చెందిన కమలా హరీస్ ను ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేయడం రికార్డ్ సృష్టిస్తే, రికార్డ్ స్థాయిలో భారతీయ ఎన్నారైలకు బిడెన్ కీలక పదవులు అప్పగించడం మరో రికార్డ్ అనే చెప్పాలి..ఇదిలాఉంటే
20 మంది భారతీయులను ఎంపిక చేయడం ఒక రికార్డ్ అయితే ఆ 20 మందిలో 13 మంది మహిళలు ఉండటం మరొక రికార్డ్. నీరా టాండన్, వివేక్ మూర్తి, వనితా గుప్తాలకు బిడెన్ అత్యంత కీలకమైన పదవులు అప్పగించారు. అంతేకాదు ఈ 13 మంది మహిళలలో ఇద్దరు కాశ్మీర్ మహిళలు ఉండటం మరొక విశేషం. అలాగే మరో కొన్ని కీలక పదవులను బిడెన్ భారతీయ ఎన్నారైలకు అప్పగించారు. అయితే ఏ అధ్యక్షుడు చివరికి ఒబామా కూడా ఇప్పటివరకూ భారతీయులకు ఈ విధంగా పదవులు ఇవ్వలేదని అంటున్నారు నిపుణులు. అయితే బిడెన్ ఇంతగా భారతీయులకు పదవులు ఇవ్వడానికి కారణం లేకపోలేదు. భారతీయులకు అపారమైన మేధస్సు ఉంటుందని, కష్టపడి పనిచేయడంలో వారికి వారే సాటని బిడెన్ ముందు నుంచీ నమ్ముతున్నాడు. అందుకే నిపుణులైన భారత ఎన్నారైలను బిడెన్ తన టీమ్ లోకి చేర్చుకున్నారు.  త్వరలో వీరందరూ భాద్యతలు చేపట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: