కేంద్రంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నవాళ్లూ, మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి బాధ్యతలు చూసే వాళ్లు విచిత్రంగా వార్తల్లోకి వస్తుంటారు. ప్రజల బాగోగులపై శ్రద్ధ కలిగిన వారు అయితే... ఆసక్తికరమైన ప్రకటనలతో వార్తల్లోకి వస్తుంటారు. ప్రస్తుత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హర్షవర్ధన్ కూడా ఈ పరంపరను కొనసాగిస్తున్నాడు. ప్రజారోగ్యం గురించి తన అభిప్రాయాలను చెబుతూ.. యువతీయువకులకు సూచనలు చేస్తూ హర్షవర్ధన్ ఆసక్తిని రేపుతున్నాడు. ఆ మధ్య ఒకసారి.. యువకులు కండోమ్ ధరించి ఎయిడ్స్ నుంచి రక్షణ పొందడం కాదు.. అసలు అనైతిక, అసురక్షిత లైంగిక కార్యకలాపాల జోలికే వెళ్లకుండా ఉండి.. ఎయిడ్స్ నుంచి రక్షణ పొందాలి.. అని మంత్రిగారు సలహా ఇచ్చారు. ఇది అందరి ప్రశంసలూ అందుకొంది. కండోమ్ కి కాదు, విలువలకు కట్టుబడి ఉండాలని మంత్రిగారు వ్యాఖ్యానించడం అందరికీ నచ్చింది. యువతకు ఇటువంటి పద్ధతిలో సూచనలు చేయడం మంచిదనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే తాజాగా మంత్రిగారు చేసిన మరో ప్రకటన మాత్రం మేధావుల ఆగ్రహానికి గురి అవుతోంది. పాఠశాల విద్యలో లైంగిక పాఠాలను తొలగించాలి అన్నట్టుగా మంత్రిగారు మాట్లాడారు. హైస్కూల్ విద్యార్థులకు లైంగిక పాఠాలు అనవసరమని మంత్రి అన్నాడు. దీనిపై మేధావి వర్గం నుంచినే వ్యతిరేకత రావడం విశేషం. బీజేపీకి ఎన్నికల ముందు అనుకూలంగా మాట్లాడిన చేతన్ భగత్ వంటి రచయితే కూడా మంత్రిగారి తీరును తప్పుపట్టారు. బీజేపీ కి యువత మద్దతు తెలిపింది అంటే.. ఆ పార్టీ తమను ముందుకు తీసుకెళుతుందని యువత భావించిందనేదానికి నిదర్శనమని.. కానీ.. బీజేపీ వాళ్లు యువతను వెనుకకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చేతన్ భగత్ వ్యాఖ్యానించాడు. పాఠశాలవిద్యలో లైంగిక బోధనలు వద్దన్న మంత్రిగారి వ్యాఖ్యలపై ఇలాంటి స్పందన వచ్చే సరికి ఆయన మాట సరి చేసుకొంటున్నారు. తాను అసలు ఆ మాటే అనలేదని, తన మాటలను మీడియా వక్రీకరించిందని... సగటు రాజకీయ నేతలా మాట్టాడాడు! హైస్కూల్ లెవల్ స్టడీస్ లో లైంగిక విద్యను తొలిగించే ఉద్దేశం ఏదీ లేదని ఆయన స్పష్టం చేశాడు! ఇదీ కథ!

మరింత సమాచారం తెలుసుకోండి: