రాప్తాడు: అనంతపురం రాజకీయాల గురించి మాట్లాడితే ముందుగా పరిటాల రవి గురించి చర్చ తప్పక వస్తుంది. అంతలా ఆ జిల్లా రాజకీయాలను ఆయన ప్రభావం చేశారు. కేవలం అనంతపురంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల రవికి అభిమానులు ఉన్నారు. అనంతపురంలో పరిటాల కుటుంబమే మొదటి నుంచి రాజ్యమేలుతూ వస్తోంది. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. జిల్లాలో పరిటాల కుటుంబాన్ని బలహీన పరిచేందుకు వైసీపీ ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తోంది. పరిటాల రవి రాక్షసుడు అంటూ హిందూ పురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.

ఇక ఇప్పుడు అనంతపురంలో ఏర్పాటు చేసిన పరిటాల రవి ఫ్లెక్సీలను దుండగులు కాల్చేయడంతో మరో సారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిటాల రవి 16వ వర్దంతి సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే కంబదూరం మండలంలోని కదిరి దేవరపల్లి గ్రామంలోనూ పరిటాల రవి అభిమానులు ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలకు నిప్పంటించి పారిపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వైసీపీ నేతలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరుగుతోంది. పరిటాల రవి వర్దంతా సందర్భంగా జిల్లాలోని స్థూపం వద్ద ఆయన భార్య పరిటాల సునీత, కుమారుడు శ్రీరామ్ నివాళులర్పించారు. కాగా.. ఇటీవల పరిటాల శ్రీరామ్ తన కొడుకుకు తన తండ్రి పేరునే పెట్టిన విషయం తెలిసిందే. తన తండ్రి పేరుతో కొడుకును పిలుస్తూ నామకరణోత్సవ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ భావోద్వేగానికి కూడా గురయ్యారు. కాగా.. గత ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి పరిటాల శ్రీరామ్ వైసీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: