హైదరాబాద్ నగరం గత కొన్ని దశాబ్దాలుగా బహుముఖంగా విస్తరించింది. అన్నివైపులా కిలోమీటర్లదూరం అభివృద్ధి పరుగులు పెట్టింది. కొత్త కొత్త వెంచర్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల రాక కారణంగా ఈ విస్తరణ సాధ్యమైంది. ఐతే... పది పదిహేనేళ్లుగా విజయవాడ హైవే మార్గం మాత్రం అభివృద్ధికి ఆమడదూరంలోనే ఆగిపోయింది. హైవేపైనే ఉన్నా.. హయత్ నగర్ తర్వాత అంతగా అభివృద్ధి కనిపించదు.  విజయవాడ హైవే అంతగా అభివృద్ధి కాకపోవడానికి సరైన కారణాలు కనిపించవు. ఐతే.. ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు హయత్ నగర్ మండలంలో వేల ఎకరాలు కొనుగోలు చేయడం, అందులోని కొంత ప్రాంతంలో ఫిలింసిటీ కట్టడం వల్లే.. కాంగ్రెస్ ప్రభుత్వాలు అటువైపు అభివృద్ది చేయలేదని కొందరు చెబుతారు. అందుకే నగరానికి అందుబాటులోనే ఉన్నా.. కొత్త ప్రాజెక్టులేమీ ఈ ప్రాంతానికి రాలేదట. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. హయత్ నగర్ మండలానికి మహర్దశ పట్టే అవకాశం కనిపిస్తోంది.  ఈమధ్య రామోజీతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న కేసీఆర్.. ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. రామోజీ భూముల విలువ అమాంతం పెరిగేలా.. రంగారెడ్డి జిల్లా పరిధిలో హయత్‌నగర్ మండలం కోహెడలో స్మార్ట్ సిటీని ప్రపంచస్థాయి సదుపాయాలతో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం నిర్మాణరంగంలో విశేష అనుభవం కలిగిన దుబాయ్ హోల్డింగ్స్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ బృందానికి టీఎస్‌ఐఐసీ అధికారులు కోహెడ స్థలాన్ని చూపించారు కూడా. దీంతో పాటు ఘట్‌కేసర్ మండలం బోడుప్పల్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో స్థలాలు కూడా పరిశీలించినా.. రామోజీ కోసం కోహెడలోనే స్మార్ట్ సిటీ ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: