ప్రతియేటా టీచర్స్ డే రోజున ఉపాధ్యాయులు ఎంతో ఆనందంగా పిల్లలతో సమయాన్ని గడుపుతుంటారు. హ్యాపీ టీచర్స్ డే అంటూ పిల్లలు చెప్పే శుభాకాంక్షలు వారి జీవితాలను రంగులమయం చేస్తాయి. కానీ గత ఏడాది నుంచి ఉపాధ్యాయుల జీవితాలు తలకిందులయ్యాయి. ఈ కరోనా కాలంలో చాలామంది ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ప్రైవేటు ఉద్యోగస్తులు ఉపాధి కోల్పోయి అవస్థలపాలైయ్యారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దేశవ్యాప్తంగా పాఠశాలలన్నీ మూసివేయడంతో చాలామంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. జీతాల్లేక కుటుంబ పోషణ భారమై కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. పొట్ట గడవని దుర్భర పరిస్థితుల్లో మరికొందరు కూలి పనులు చేశారు. కొందరు ఆటో నడిపితే ఇంకొందరు కూరగాయలు అమ్మారు. రోడ్డు మీద చెప్పులు, మాస్కులు అమ్ముకుంటూ కనిపించిన ప్రైవేటు టీచర్లు ఎందరో ఉన్నారు. తాపీ మేస్త్రిలుగా, చిల్లర వ్యాపారస్తులుగా మారే విచిత్రమైన పరిస్థితి రావడంతో వారి ఆత్మగౌరవానికి ఎంతో భంగం వాటిల్లింది.


పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుల జీవితాలు చీకటితో నిండిపోవడంతో చాలామంది విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే వేలాది మంది ఉపాధ్యాయులు చనిపోయారు. ఇన్నేళ్లు పాఠశాలలకు వెన్నుముకలా నిలిచిన ఉపాధ్యాయులను ఆదుకోవాల్సిన యాజమాన్యాలు మొహం చాటేశారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశారు కానీ టీచర్లకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రైవేటు యాజమాన్యాలకు మనసు రాలేదు. ఈ కరోనా సంక్షోభంలో వారి జీవితాల్లో దాపురించిన దుస్థితి వర్ణనాతీతం.

నిజానికి చాలా మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు తమ అభిరుచికి తగ్గట్టుగా అరకొర జీతానికే పాఠాలు బోధిస్తుంటారు. వారి పరిస్థితి రెక్కాడితే గానీ డొక్కాడదు అనే ధోరణి లో ఉంటుంది. ఇక కనిపించని పెనుభూతం కరోనా కల్లోలంతో వారి జీవితాలు బజారున పడ్డాయి. పీహెచ్‌డీ చేసిన లెక్చరర్లు సైతం పొలంలో పనులు చేసారంటే.. కరోనా ఉపాధ్యాయులపై ఎంతటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే, ఈరోజు టీచర్స్ డే అయినప్పటికీ.. ఉపాధ్యాయుల సంతోషంగా జరుపుకోవడానికి తమ జీవితాలు ఇంకా చక్కబడలేదని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: