రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రెండు పదవులకు మోదీ ఎవరిని కావాలంటే వారిని నియమించుకునే అవకాశం ఉంది. పార్లమెంటులో బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉంది. కాబట్టి ఆయన కోరుకునేవారే ఆ పదవులు చేపడతారు. అయితే.. ఇప్పటికే ఈ పదవుల రేసులో చాలా మంది ఉన్నారు. మరికొన్ని కొత్త పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఉప రాష్ట్రపతి  పదవి కోసం ఢిల్లీ సర్కిళ్లో కొత్తగా వినిపిస్తున్న పేరు నితీశ్‌ కుమార్‌.


బీహార్ సీఎం నితీశ్‌ కుమారే కాబోయే ఉప రాష్ట్రపతి అని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి కూడా కామెంట్ చేశారు. రబ్రీదేవిని విలేఖరులు అడిగితే.. నితీశ్ కుమార్‌ వెళ్లాల్సిందే.. ప్రతి ఒక్కరూ ఇదే కోరుకుంటున్నారని జవాబు ఇచ్చారట. నితీశ్ కుమార్ ఒకప్పుడు ప్రధాని పదవి కోసం మోదీతోనే పోటీపడ్డారు. కానీ.. ఆ తర్వాత రాజీపడి బీజేపీతో దోస్తీ చేస్తున్నారు.


నితీశ్ కుమార్‌కు మంచి సీఎంగా పేరుంది. పరిపాలన విషయంలోనూ ఆయనకు మంచి మార్కులే పడతాయి. గతంలో లాలూ పాలనలో అవినీతితో విసిగిపోయిన రోజుల్లో నితీశ్ కుమార్‌ వైపు బీహారీలో మొగ్గారు. జేడీయూ కు జనం పట్టం కట్టారు. బీహార్ వికాస్ పురుష్‌గా నితీశ్ కుమార్ ప్రజల మన్ననలు పొందారు. అయితే.. మోదీ మొదటి సారి పీఎం అయ్యే సమయంలో మాత్రం ఎన్డీఏ భాగస్వామిగా నితీశ్ కుమార్ దాన్ని బాగా వ్యతిరేకించారు.


సెక్యులర్ వాదిగా పేరున్న నితీశ్ కుమార్.. మతతత్వ ముద్ర ఉన్న నరేంద్ర మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ప్రశ్నించారు. బాగా వ్యతిరేకించారు. ఒక దశలో ఎన్డీఏ వీడి వెళ్లిపోయారు కూడా. అదే సమయంలో ఆయన అవినీతి పార్టీగా పేరు పడిన ఆర్జేడీతోనూ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మోడీ ప్రధాని అయిన తర్వాత నితీశ్ మళ్లీ ఎన్డీఏ గూటికి చేరారు. ఇప్పుడు బీహార్‌లో నడుస్తున్నది జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమే. మొత్తానికి ఎన్డీఏతో సుదీర్ఘ దోస్తీ ఫలితంగా ఇప్పుడు నితీశ్ కుమార్‌కు ఉపరాష్ట్రపతి పదవి దక్కబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: