రాబోయే ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వుచేసిన సీట్లలోనే కాకుండా జనరల్  సీట్లలో కూడా టికెట్లు ఇవ్వాలని ఎస్సీ నేతలు అడిగారా ? అధికారపార్టీలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు సీనియర్ నేతలు సమావేశమయ్యారు. గతంలో బీసీలను వైసీపీ వైపు సంఘటితం చేయట కోసం ప్రత్యేకించి బీసీ సమావేశం తర్వాత సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. అదే పద్దతిలో ఇపుడు ఎస్సీలతో కీలక సమావేశం నిర్వహించారు.





ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన  సమావేశానికి ఎస్సీ ప్రజాప్రతినిధులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి  డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతు జనరల్ స్ధానాల్లో కూడా ఎంపీ లేదా ఎంఎల్ఏలుగా ఎస్సీలకు అవకాశం ఇవ్వాలని అడిగారట.  అలా ఇచ్చేట్లయితే తానే ఎంపీగా లేదా ఎంఎల్ఏగా పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారట.  అయితే అడిగేముందు తన కోరిక ఆచరణ సాధ్యమా ? కదా ? అని డొక్కా ఆలోచించినట్లు లేదు.





రిజర్వుడు సీట్లలో జనరల్ అభ్యర్ధులకు పోటీ ఎలా సాధ్యంకాదో జనరల్ సీట్లలో రిజర్వుడు కేటగిరి అభ్యర్ధులకు సీట్లు ఇవ్వటానికి ఏ పార్టీ కూడా ఇష్టపడదు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న డొక్కాకు ఇంతచిన్న విషయం తెలియదా. పైగా ఎస్సీల్లోని మాలలు 20 మంది ఎంఎల్ఏలుంటే మాదిగలు 8 మంది ఎంఎల్ఏలు మాత్రమే ఉన్నారని చెప్పారట. ఇద్దరు సమానంగా ఉండేట్లు చూడమన్నారట. రాష్ట్రంలోని ఎస్సీ సీట్లు 29 ఉంటే అందులో 28 వైసీపీ, ఒకచోట టీడీపీ గెలిచింది. టికెట్లు ఇచ్చేటపుడు మామూలుగా మాలలు, మాదిగల్లో ఎవరి సంఖ్య ఎక్కువగా ఉందని చూసే కేటాయిస్తుంటారు.





మాదిగ ఎంఎల్ఏల సంఖ్య తక్కువగా ఉండటానికి కారణం రాష్ట్రం మొత్తంమీద  మాదిగలు ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉండటం. మిగిలిన ప్రాంతాల్లో మాలల సంఖ్యే ఎక్కువ కాబట్టే ఆ వర్గం నుండి ఎంఎల్ఏల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక తొందరలోనే జయహో ఎస్సీ సదస్సు నిర్వహించాలని కూడా సమావేశం డిసైడ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ ప్రణాళికను తొందరలోనే రెడీ చేయబోతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: