హైదరాబాద్: ఫిలింనగర్ లోని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై రాళ్లు రువ్విన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడైన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానిపై వేటు పడిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ దాడి పని ఆకతాయిలదంటూనే టీడీపీ నాయకులు రాజకీయ రంగును రుద్దుతున్నారు. ఎన్టీఆర్ కార్యాలయంపై కొడాలి నాని అనుచరులు దాడి చేయించారనీ తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.
ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించగా...ఆ పార్టీ అనుబంధ సంస్థ అయితే తెలుగుయువత తమ్ముళ్లు మాత్రం దాడి చేసింది తాము కాదనీ, వైఎస్ఆర్ పార్టీ వాళ్లు చేసి ఉంటారనీ అంటున్నారు. నందమూరి కుటుంబం-నారావారి కుటుంబం మధ్యన చిచ్చు పెట్టేందుకే ఎన్టీఆర్ కార్యాలయంపై దాడి చేయించారనీ తెలుగుతమ్ముళ్ల ఆరోపణ. హరిక్రిష్ణ మాత్రం దీనిని రాజకీయం చేయొద్దంటున్నారు. టీడీపీ వర్సెస్ కొడాలి నాని మధ్యన ఆసక్తికరమైన రాజకీయం సాగుతున్న క్రమంలో ఎన్టీఆర్ కార్యాలయంపై దాడి జరగడం రాజకీయంగా వేడెక్కిస్తోంది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయమేటిటంటే టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మరో అడుగు ముందుకేసీ ఎన్టీఆర్ కార్యాలయం దాడికి తమకు సంబంధం లేదంటున్నారు. ‘గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు’గా వుంది వారి వాదన. దాడికి తమకు సంబంధం లేదనడంలో అర్థం ఏమిటో అర్థం కావడం లేదు. ఎన్టీఆర్ తండ్రి రాజ్యసభ సభ్యుడు హరిక్రిష్ణ మాత్రం దాడిని రాజకీయం చేయొద్దంటున్నారు. తెలుగు తమ్ముళ్లు మాత్రం దీనిని పూర్తిగా రాజకీయం చేస్తున్నారు. దాడిని హరిక్రిష్ణ లైట్ గా తీసుకుంటున్నారు. ఫిలింనగర్ లాంటి ప్రాంతాలలో ఇలాంటి సర్వసాధరణమనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.
కానీ, టీడీపీలోని కొందరు ఎలాగైనా ఈ దాడిని కొడాలి నానికో, వైఎస్ఆర్ పార్టీకో అంటగట్టాలని చూస్తున్నట్లు అగుపిస్తోంది. హరిక్రిష్ణ అంటున్నట్లు ఈ పని ఆకతాయిలే చేసినట్లు తేలితే టీడీపీ మూల్యం చెల్లించుకోకతప్పదు. అయితే, ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ షూటింగ్ నిమిత్తం ఇటలీకి వెళ్లినట్లు సమాచారం. దాడిపై ఆయన ఏమీ స్పందించకపోవడం కొసమెరుపు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి