జగనన్న బాణాన్ని అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంపీ వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటి నుంచి ప్రారంభమైంది. మోకాలి గాయంతో డిసెంబర్ లో షర్మిల పాదయాత్రకు బ్రేక్ పడింది. శస్త్రచికిత్స అనంతరం షర్మిల పూర్తిగా కోలుకోవడంతో తిరిగి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని తుర్కయాంజాల్ నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. ఆమెకు మద్దతుగా వేలాదిమంది ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. తుర్కయాంజాల్ ఎస్ఎస్ఆర్ గార్డెన్స్ నుంచి ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం రాగన్నగూడ, మన్నెగూడ ఔటర్‌రింగ్‌రోడ్, బొంగులూరు గేట్, కల్లెం జగ్గారెడ్డి గార్డెన్స్, మంగళంపల్లి గేట్, షేర్‌గూడ, ఇబ్రహీంపట్నం వరకు సాగుతుంది.
మరోవైపు తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్ సిపి వైఖరి చెప్పకపోవడంపై తెలంగాణవాదులు ఆగ్రహంగా ఉన్నారు. షర్మిలను తెలంగాణలో తిరగనివ్వమన్న ఓయూ విద్యార్థి జేఏసీ ప్రకటనతో పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది. ఈసారి పాదయాత్రలో షర్మిలకు ఆటంకాలు తప్పవని టీఆర్ఎస్ నేతలు కూడా హెచ్చరిస్తున్నారు. షర్మిల తన పార్టీ వైఖరిరేంటో చెప్పే పాదయాత్ర ప్రారంభించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి