బాబు వస్తే జాబు వస్తుంది.. మేం అధికారంలోకి వస్తే ప్రతి నిరుద్యోగికీ నెలకు 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం.. ఇవీ ఎన్నికల ముందు చంద్రబాబు సర్కారు ఊదరకొట్టిన హామీలు.. వాస్తవానికి ఈ నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలు చాలా కష్ట సాధ్యం.. అందులోనూ ఏపీ ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇది మరో గుదిబండే అవుతుంది. 


ఓవైపు రైతు రుణమాఫీ కోసమే చంద్రబాబు నానా తిప్పలు పడుతున్నారు. సవాలక్ష నిబంధనలు పెట్టి నామ్ కే వాస్తే గా రుణమాఫీ చేసి మమ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు అదే తరహాలో నిరుద్యోగ భృతి హామీని కూడా చేశామనిపించుకునే ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు నిరుద్యోగ భృతి గురించి ఆలోచించిన చంద్రబాబు సర్కారు ఈ ఏడాది యువకుల సాయం పేరుతో 500 కోట్లు కేటాయించింది. 


వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే.. కనీసం 20 నుంచి 30 వేల కోట్ల రూపాయలు అవసరం. కేవలం 500 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా నిరుద్యోగ భృతి ఎలా ఇస్తారో ఆర్థిక మంత్రి యనమలకే తెలియాలి. మరో విషయం ఏంటంటే..అటు బడ్జెట్ లో యనమల 500కోట్లు ప్రకటించగానే రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ఫోటోలకు పాలాభిషేకాలు ప్రారంభమయ్యాయి. 


బహుశా ఇది తెలంగాణ నుంచి తీసుకున్న స్ఫూర్తి కావచ్చు. తెలంగాణలో కేసీఆర్ వరాలు ప్రకటించడం.. లబ్ది పొందిన వర్గాలు పాలాభిషేకాలు చేయడం ఇటీవల తరచూ జరుగుతోంది. అదే తరహాలో ఏపీలోనూ క్షీరాభిషేకాల స్టంట్లు మొదలవుతాయనడంలో సందేహం లేదు. ఆ 500కోట్లు కూడా అసలైన నిరుద్యోగలకు దక్కుతాయన్న నమ్మకమూ కనిపించదు. ఆ ఇచ్చిన 500 కోట్ల సాయాన్ని బాబు అనుకూల మీడియా వందింతలు చేసి నిరుద్యోగ భృతి హామీ కూడా విజయవంతంగా అమలవుతున్నట్టు చూపుతుందేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: