హైదరాబాద్: ఆ మధ్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘బిజినెస్ మెన్’లో హీరో మహేశ్ బాబు వాడిన ఓ డైలాగ్ పాపులరైంది. అదే... ముంబాయిని ఉ.... పోయించడానికి వచ్చానంటు. ఆ డైలాగ్ ఎంతో పాపులరవ్వడమే కాదు, సినీమా విజయానికి కూడా కొంత వరకు కారణమైంది. అది సినీమా. ఇప్పుడు నిజ జీవితంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నిజంగానే రాష్ర్టంలోని హేమాహేమీలయిన ప్రజాప్రతినిధులను, సీనియర్ ఐఏఎస్ అధికారులను, బడా పారిశ్రామికవేత్తలను, ఉన్నతాధికారులను నిజంగానే ఉ.... పోయిస్తున్నాడు. లక్ష్మీనారాయణ పేరు చెబితే చాలు గజగజ వణికిపోతున్నారు.
పారిశ్రామికవేత్తలు రాష్ర్టానికి రావాలంటేనే భయపడిపోతున్నారు. రాష్ర్టంలోని కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ....తొలుత మహారాష్ర్టలోని నాందేడ్ జిల్లా పోలీస్ బాస్ గా బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుంచి మన రాష్ర్టానికి 2005లో రాష్ర్టానికి సీబీఐ అధికారిగా డిప్యూటేషన్ పై వచ్చారు. తొలుత పరిటాల రవి కేసు మొదలుకుని ఈనాటి జగన్ అక్రమ ఆస్తుల కేసు వరకు ఎన్నో కేసులను లక్ష్మీనారాయణ దర్యాప్తు చేశారు. ముఖ్యంగా ఓబులాపురం మైనింగ్, జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో అనేక మంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు జైల్లో ఊచలు లెఖ్కిస్తున్నారు.
మరి కొందరు జైలుకు వెళ్లేందుకు క్యూలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులెదురైనా, అవరోధాలు కలిగిస్తున్నా కూడా లక్ష్మీనారాయణ వేటిని లెఖ్కచేయకుండా కేసుల దర్యాప్తు సాగిస్తూ చార్జిషీట్లను దాఖలు చేస్తున్నాడు. ఎంతో పలుకుబడి కలిగిన మంత్రులను సైతం జైలుకు వెళ్లే విధంగా చేశాడాయన. రాష్ర్టంలో అధికార పార్టీ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. జగన్ అక్రమ ఆస్తుల కేసు విషయంలో లక్ష్మీనారాయణ కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. కేసుకు సంబంధించి తన చిన్ననాటి మిత్రురాలైన చంద్రబాల ద్వారా జగన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న మీడియా సంస్థలైన ఆంధ్రజ్యోతి, ఈనాడు, మరికొన్ని మీడియా సంస్థలకు ముందస్తుగానే వార్తలను లీక్ చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
కేసుల దర్యాప్తుతో ప్రజాప్రతినిధులను, ఐఏఎస్ అధికారులను, బడా పారిశ్రామికవేత్తలతో ఓ ఆట ఆడుకుంటున్న లక్ష్మీనారాయణ మీడియా సంస్థలకు వార్తలకు లీక్ విషయంలో ఫోన్ లిస్టు వ్యవహారంలో కొంత ఇబ్బందిపడాల్సి వచ్చింది. చంద్రబాల ఫోన్ లిస్టు వ్యవహారం లక్ష్మీనారాయణను కూడా ఇరకాటంలో పడేటట్లు చేసింది. మొత్తానికి లక్ష్మీనారాయణ రాష్ర్టంలోని ఎంతో మందికి కంటిమీద కునుకు లేకుండా చేశారు.
విలాసవంతమైన జీవితాలను గడపాల్సిన వారిని జైల్లో కటిక నేలమీద పడుకోబెట్టాడు. ఈ కేసులపై చివరకు న్యాయస్థానం ఏమి తేలుస్తుందో తెలియదు. కానీ, ఇప్పుడు మాత్రం సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అనేక మంది జీవితాలను చిందరవందరంగా చేశాడనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి