కేసీఆర్ సీఎం అయ్యాక యాదగిరి గుట్టకు మహర్దశ పట్టింది. గతంలో ఏ పాలకుడూ చూపించనంత శ్రద్ధ కేసీఆర్ ఈ ఆలయం పై చూపించారు. ఏకంగా వందల కోట్ల బడ్జెట్ కేటాయించారు. చిన జీయర్ స్వామి సూచనలతో ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. అంతా బాగానే ఉంది. దీన్ని తప్పుబట్టేవారి సంగతి అటుంచితే.. కేసీఆర్ యాదాద్రి తల రాతనే మార్చేశాడన్నది నిజం.


కానీ ఇప్పుడు మరో షాకింగ్ వార్త వెలుగు చూసింది. యాదాద్రి ఆలయ రాతి స్తంభాలపై ఏకంగా కేసీఆర్ చిత్రాలు చెక్కారట. అంతే కాదు.. టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు కారు కూడా ఆలయ స్తంభాలపై చెక్కారట. అంతేనా... తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం, కేసీఆర్‌ కిట్‌, హరితహారం, రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు వంటి వాటిని కూడా యాదగిరి గుట్ట ఆలయ స్తంభాలపై చెక్కినట్టు ఓ ప్రధాన పత్రిక సంచలన కథనం వెలువరించింది.


అష్టభుజి ప్రాకార మండప రాతిస్తంభాలపై ప్రస్తుతం చలామణీలో లేని పైసా, రెండు, మూడు, ఐదు, ఇరవై పైసల నాణేలు పొందుపరిచారట. బతుకమ్మ వంటి పండుగలు, నాగలి దున్నే రైతు వంటి బొమ్మలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నిక్షిప్తం చేశారట. తాజాగా ప్రాకార మండపానికి దక్షిణం వైపుగల రాతి స్తంభాలపై తెలంగాణ ఆధునిక చరిత్ర, ప్రభుత్వ పథకాలతోపాటు రాజకీయ అంశాలను చెక్కుతున్నారట.


తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానాన్ని రాతి స్తంభాలపై నిక్షిప్తం చేయాలనుకోవడం.. భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలనుకోడవం కొంతవరకూ సబబే. కానీ కేసీఆర్‌ చిత్రం; టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు కారు వంటివి చెక్కడం కచ్చితంగా విమర్శలకు దారి తీస్తాయి. మరి ఇవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకే జరుగుతున్నాయా.. లేక.. శిల్పులు అత్యుత్సాహంతో వాటిని చెక్కుతున్నారా అనేది ఇంకా తేలాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: