మహారాష్ట్రలో మహా సమరానికి తెరలేచిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా, 24న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక నోటిఫికేషన్ రావడమే ఆలస్యం ప్రధాన పార్టీలు  గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్-ఎన్‌సి‌పి కలిసి ముందుకెళుతుండగా...మరోవైపు గత ఎన్నికల్లో పొత్తుగా పోటీ చేసి విజయం సాధించిన బీజేపీ-శివసేనలు మరోసారి కలిసి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.


అయితే తాజాగా సీట్ల సర్దుబాటు విషయంలో ఈ రెండు పార్టీలకు చెడినట్లు కనబడుతోంది. 288 సీట్లలో తమకు సగం సీట్లు ఇవ్వాలని శివసేన డిమాండ్ చేస్తుంటే....బీజేపీ అన్ని సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో కొన్ని రోజులుగా రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై వివాదం చెలరేగుతోంది. ప్ర‌తి ఎన్నిక‌కు ఈ రెండు పార్టీలు గొడ‌వ‌ల‌కు దిగ‌డం... త‌ర్వాత స‌ర్దుబాటు చేసుకుని మళ్లీ క‌లిసిపోవ‌డం కామ‌న్ అయిపోయింది.


తాజాగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే 288 నియోజకవర్గాల నేతలు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తండ్రి బాల్ థాక్రేకు ఇచ్చిన మాట ప్రకారం శివ సైనికుడిని మహారాష్ట్ర సీఎంగా చేస్తానని కార్యకర్తలకు మాట ఇచ్చారు. అలాగే బీజేపీతో సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు జరుగుతున్నాయని, రెండు రోజుల్లోనే సీట్ల వ్యవహారం తేలిపోతుందని అన్నారు.


కానీ పరిస్తితి చూస్తే సీట్ల వ్యవహారం ఇప్పటిలో తెగేలా కనపడటం లేదు. సగం సీట్లు అయితే కావాలని శివసేన పట్టుబట్టిఉంది. పొత్తు కుదరకపోతే ఒంటరిగా అయిన పోటీ చేయడానికి సిద్ధమని శివసేన నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో బీజేపీ 125 సీట్లు , డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు చూస్తుందని సమాచారం. చూడాలి మరి బీజేపీ-శివసేన పొత్తు పెటాకులు అవుతుందో లేక సెట్ అవుతుందో?


మరింత సమాచారం తెలుసుకోండి: