పదకొండు నెలల కాలంలో 86 అత్యాచారాలు, 185 లైంగిక వేధింపుల కేసులు..ఇవన్నీ జరిగింది దేశవ్యాప్తంగానో లేదంటే.. ఓ మొత్తం రాష్ట్రంలోనో కాదు...కేవలం ఉన్నావో జిల్లాలో. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకు 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నావో ఇప్పుడు రేప్ క్యాపిటల్‌గా మారిపోయింది.  31లక్షల జనాభా ఉన్న ఉన్నావో మహిళలపై వేధింపులకు చిరునామాగా మిగిలిపోయింది. ఇన్ని ఘటనల్లో నిందితులకు శిక్ష పడిన కేసు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. నిందితులు అరెస్టవడం, బెయిల్ మీద విడుదలవడం ఇక్కడ నిత్యకృత్యమయింది. 

 

ఉన్నావో...ఈ పేరు వింటే చాలు..దేశమంతా ఉలిక్కిపడుతోంది. జనవరి, నవంబర్ మధ్య కాలంలో ఈ జిల్లాలో 86 అత్యాచార కేసులు నమోదయ్యాయంటే అక్కడ మహిళలకు ఎంత భద్రత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఓ బాలికపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్  అత్యాచారం జరిపిన కేసు... ఉన్నావో దారుణంగా దేశవ్యాప్తంగా అందరికీ గుర్తుండిపోయింది. తాజాగా మరో కేసులో అత్యాచార బాధితురాలిని బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులు సజీవ దహనం చేయడం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. 

 

గత డిసెంబరులో బాధితురాలిపై అత్యాచారం జరిగింది. పెళ్లి పేరుతో బాధితురాలిని నమ్మించిన నిందితుడు, స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నిందితుని మోసం గ్రహించిన యువతి వారిపై పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు గత నెల 25న బెయిల్‌పై విడుదలయ్యారు. జైలులో ఉన్నా నిందితుల ప్రవర్తనలో మార్పు రాకపోగా, బాధితురాలిపై మరింత పగ పెంచుకున్నారు. కేసు తదుపరి విచారణ కోసం రాయబరేలి కోర్టుకు బయలుదేరిన యువతిపై ఆమె ఇంటి దగ్గరే దాడికి తెగబడ్డారు. ప్రధాన నిందితులు  ముగ్గురు స్నేహితులతో కలిసి బాధితురాలిపై కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టారు. 90శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ బాధితురాలు మరణించింది. తనపై దాడికి పాల్పడిన వారిని ఉరితీయాలన్నది చివరి కోరికగా మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పింది. ఈ ఘటన ఉన్నావోలో నెలకొన్న దారుణ పరిస్థితులకు నిలువెత్తు సాక్ష్యం. నిందితులకు బెయిల్ ఇవ్వకుండా ఉండుంటే వారు బాధితురాలిని హత్య చేసి ఉండేవారు కాదు...ఈ కేసులోనే కాదు...ఉన్నావోలో నమోదవుతున్న అన్ని కేసుల్లోనూ దాదాపు నిందితులు ఇలానే బెయిల్ పై విడుదలవుతున్నారు. 

 

ఉన్నావో పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారడానికి కారణమైన కుల్దీప్ సింగ్ కేసులో ఎన్నో అమానుషాలు జరిగాయి.  ఓ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ కుల్దీప్, ఆమె కుటుంబ సభ్యులతోనూ అమానవీయంగా ప్రవర్తించాడు. అత్యాచారంపై బాలిక ఫిర్యాదు చేసిందన్న కోపంతో కుల్దీప్ సింగ్ సోదరుడు బాలిక తండ్రిపై దాడిచేశాడు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన పోలీసులు కూడా ఎంఎల్ఏ పక్షాన నిలిచారు. అత్యాచారం కేసులో కుల్దీప్ సింగ్‌ను అరెస్టు చేయాల్సిన ఖాకీలు, బాలిక తండ్రిపై తప్పుడు కేసు నమోదు చేసి, ఆయన్ను కస్టడీలో విచక్షణారహితంగా కొట్టి చంపారు. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇంటిముందు కుటుంబంతో కలిసి బాలిక ఆత్మహత్యాయత్నం చేయడంతో  అందరికీ ఈ దారుణం గురించి తెలిసింది. ఈ కేసు తర్వాత మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పోలీసులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో దుండగులు దారుణాలకు ఒడిగడుతున్నారు. రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తూ పోలీసులు ప్రజలను పట్టించుకోవడం లేదని ఉన్నావో ప్రజలు మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: