గత కొన్ని నెలల నుండి ఆకాశాన్ని తాకిన ఉల్లి ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్త పంట అందుబాటులోకి వస్తూ ఉండటం ఉల్లి ధరలు తగ్గటానికి కారణమని తెలుస్తోంది. హైదరాబాద్ మార్కెట్ లో మహారాష్ట్ర రాష్ట్రం నుండి వచ్చిన మేలు రకం ఉల్లి 70 రూపాయల నుండి 90 రూపాయలకు విక్రయిస్తుండగా కర్నూల్, మహబూబ్ నగర్ నుండి వచ్చిన ఉల్లి 30 నుండి 50 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. 
 
పాత ఉల్లి మాత్రం హైదరాబాద్ మార్కెట్ లో 100 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్ నగరానికి మహారాష్ట్ర రాష్ట్రం నుండి పంట భారీగా దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. రబీ పంటను మహారాష్ట్ర రాష్ట్రంలో రైతులు ముందుగానే ప్రారంభించటంతో ఉల్లి సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని రైతు బజార్లలో కిలో ఉల్లి 40 రూపాయల చొప్పున విక్రయిస్తుండగా ఆంధ్రప్రదేశ్ లోని రైతు బజార్లలో మాత్రం కిలో ఉల్లిని 25 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. 
 
రెండు నెలల క్రితం 30 నుండి 40 రూపాయలు పలికిన ఉల్లి ధర గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో 200 రూపాయలకు చేరింది. ఉల్లి కొనే పరిస్థితి లేకపోవడంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ప్రజలు ఉల్లి తినడమే మానేస్తూ ఉండగా కొంతమంది మాత్రం ఉల్లి బదులు వంటల్లో క్యాబేజీని ఉపయోగిస్తున్నారు. కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ ఉల్లి లేకుండానే ఫుడ్ ఐటమ్స్ చేసే పరిస్థితులు వచ్చాయి. 
 
మార్కెట్ వర్గాలు ఉల్లి ధరలు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టడం ప్రజలకు శుభవార్త అనే చెప్పవచ్చు. మహారాష్ట్ర నుండి భారీ స్థాయిలో హైదరాబాద్ మార్కెట్ కు ఉల్లి వస్తూ ఉండగా ఏపీ ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉల్లి ధరలు క్రమేపీ తగ్గుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: