గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని ఒకేచోట అభివృద్ధి ఆగిపోకూడదు అని అందుకే 3 రాజధానిలు ఏర్పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించడం ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం రేపింది. భారీ ఎత్తున అమరావతి రైతులందరూ తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు దీంతో అమరావతి మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అమరావతి రైతులు భారీ ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కృష్ణ గుంటూరు జిల్లాల వైసిపి ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలు సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. అమరావతి భవితవ్యం గురించి తేల్చేశారు వైసిపి ముఖ్య నేతలు.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం జిఎన్ రావు కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. దీనిపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే పార్థసారథి... రైతులు రైతు కూలీలు సంతోషంగా సంతృప్తి చెందేలా అమరావతిని అభివృద్ధి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. ఏ నిర్ణయం తీసుకుని ఎలా అభివృద్ధి చేస్తే అమరావతి అభివృద్ధి చెందుతుంది ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు... జిఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం చేసి కొత్త నగరాలు కట్టడం కాదు.. నగరాలు ఉన్నచోట రాజధాని నిర్మించాలని హితవు పలికారు. చంద్రబాబు రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపించి ఓ తాత్కాలిక సెటప్ వేశారని అందుకోసం 5800 కోట్లు ఖర్చు చేశారని విమర్శలు చేశారు. అమరావతి అభివృద్ధి చేయాలంటే ఇంకా లక్ష కోట్లు కావాలని... అంత డబ్బు ఒకే చోట పెట్టి అభివృద్ధి చేయడం కుదిరేపని కాదని అందుకే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే యోచనలో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. తక్కువ ఖర్చు తో ఎక్కువ లాభం వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి