ఏపీ రాజధానినికి అమరావతి నుంచి విశాఖకు మార్చడాన్ని మాజీ సీఎం చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొదట్లో ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలా అని సందేహంలో ప‌డిన చంద్రబాబు.. ఆ తర్వాత పూర్తిగా అమరావతికే మొగ్గారు. తన పార్టీ ఆర్థిక ప్రయోజనాలో.. తన సామాజిక వర్గ ప్రయోజనాలో తెలియదు కానీ.. చంద్రబాబు మాత్రం పూర్తిగా జై అమరావతి అనేశారు.

 

అయితే చంద్రబాబు జై అమరావతి నినాదానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. విశాఖ టీడీపీ నాయకులు మాత్రం జై అమరావతిని వ్యతిరేకించారు. విశాఖలో రాజధాని రావాల్సిందే అన్నారు. బాబు గారూ.. ఒకే పార్టీలో ఇన్ని వాయిస్ లు ఏంటి అంటే.. అది వారి ఇష్టం.. అంటూ చంద్రబాబు దబాయించే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు కూడా రోజూ జై అమరావతి అంటున్నారు కానీ...విశాఖకు రాజధాని వద్దు అని క్లారిటీగా చెప్పడం లేదు.

 

అదేంటీ అమరావతి రాజధానిగా కొనసాగాలంటే.. విశాఖ వద్దనేగా అంటారా.. రాజు గారి చిన్న భార్య బావుందంటే.. పెద్ద భార్య బాగాలేదనే సామెత అన్నిసార్లూ వర్తించదు. చంద్రబాబు ఆ విషయమే గట్టిగా చెప్పదలచకుంటే.. ముందు ఆయన పర్యటించాల్సింది అమరావతి ప్రాంతంలోనో.. రాజమండ్రిలోనో, నరసరావుపేటలోనో.. పెనుకొండలోనో కాదు.. ముందు ఆయన విశాఖలో పర్యటిస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది.

 

అమ‌రావ‌తిలోనే రాజ‌ధానిని కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తున్న చంద్రబాబుకు విశాఖ‌లో రాజ‌ధాని వ‌ద్దనే ధైర్యం ఉందా? అనేది కీల‌క ప్రశ్న. మ‌రి దీనిని ఆయ‌న విశాఖ వేదిక‌గానే స్పష్టం చేస్తారా? అక్కడ కూడా జోలె ప‌డ‌తారా? ఒకవేళ చంద్రబాబు జై అమరావతి ర్యాలీ విశాఖలో నిర్వహిస్తే.. అక్కడి జనం దాన్ని స్వాగతిస్తే.. వైసీపీ సర్కారుకు గట్టి దెబ్బే పడుతుంది. అక్కడ కూడా ఆయన జోలె పడితే.. జనం విరివిగా విరాళాలు ఇస్తే.. ఇక సమస్యే ముంది.. జగన్ సర్కారు కూడా ఇరుకున పడుతుంది. మరి చంద్రబాబుకు అంత ధైర్యం ఉందా.. విశాఖలో జై అమరావతి ర్యాలీ తీసి.. జోలె పట్టగలరా.. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: