ఏపీలో ఎన్నికల హీట్ పెరగబోతోంది. ఈ నెల నుంచి జూన్ వరకు వరుస ఎన్నికలు జరిపేందుకు సర్కార్ సిద్దమవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉంది జగన్ ప్రభుత్వం. పాలనా పగ్గాలు చేపట్టిన ఏడాదిలోగా అన్ని రకాల ఎన్నికలను ముగించుకుని.. పూర్తి స్థాయి పాలనపై ఫోకస్ పెట్టనుంది ప్రభుత్వం.

 

ఏపీలో వరుస ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల అంశం హైకోర్టులో ఉండగా.. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు సర్వం సిద్దం చేసుకుంటోన్న ప్రభుత్వం.. బుధవారం జరిగిన కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జూన్ నెలలోగా అన్ని రకాల ఎన్నికలను పూర్తి చేసుకోవాలని భావిస్తోన్నట్టు సమాచారం. వచ్చే నెల 15వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు.. మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలనే దిశగా ఓవైపు అడుగులు వేస్తూనే.. మరోవైపు మిగిలిన ఎన్నికల నిర్వహాణకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా సహకార సంఘాల ఎన్నికలు.. నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కెబినెట్ భేటీలో కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

 

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం.. అధికార పార్టీ సర్వం సిద్దంగా ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అధికార పార్టీ కూడా పూర్తి స్థాయి సన్నద్ధతతో కన్పిస్తోంది. కోర్టు నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహాణ విషయంలో గ్రీన్ సిగ్నల్ రాగానే ఒకేసారి మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తమై ఉంది. రిజర్వేషన్లను సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50 శాతానికి పరిమితం చేయాల్సి ఉన్న క్రమంలో ఆ తతంగాన్ని ఓ రెండు రోజుల్లో పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచనగా కన్పిస్తోంది. మరోవైపు రాజకీయంగా కూడా ఇప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే చక్కటి ఫలితాలు వస్తాయనేది అధికార వైసీపీ అంచనా. ఇచ్చిన హామీల్లో సుమారు 80 శాతం మేర హామీలను అమల్లో పెట్టడం ద్వారా ప్రజల్లో పూర్తిగా పాజిటివ్ వాతావరణం కన్పిస్తోందనేది అధికార పార్టీ ధీమా. ఈ క్రమంలో ఏ క్షణంలో ఎన్నికలు పెట్టినా.. గెలుపు తమదేననే ధీమాతో ఉంది అధికార వైసీపీ. పైగా ఇటీవల కాలంలో అమ్మఒడి, ఇంటింటికి ఫించన్లు వంటి పథకాలతో ప్రజల్లో మంచి ఆదరణ లభించిందని.. ఈ క్రమంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికలు పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది అధికార పార్టీ అంచనా.

 

మరోవైపు ప్రతిపక్షం కూడా స్థానిక సంస్థలు.. మున్సిపల్ ఎన్నికలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏ క్షణాన్నైనా ఎన్నికలకు వెళ్లడం ఖాయంగా కన్పిస్తున్న క్రమంలో తమ పార్టీ శ్రేణులను సిద్దం చేస్తోంది సర్కార్. పైగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుంటే.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా పోతాయని.. ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి సుమారు మూడు వేల కోట్ల రూపాయల మేర నిధులు వస్తాయి కాబట్టే ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతోందనేది ప్రతిపక్ష వాదన. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రభుత్వంపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేఖత వ్యక్తమవుతోందనేది ప్రతిపక్షం అంచనా. ఓ మూడు రాజధానుల అంశం.. మరోవైపు పెన్షన్లు.. రేషన్ కార్డుల్లో కోత.. వంటి అంశాలు ప్రభుత్వాన్ని కచ్చితంగా ఇరుకున పెడతాయి కాబట్టి.. ఈ ఎన్నికలను అవకాశంగా తీసుకొని తమ ఉనికి కాపాడుకోవాలనేది ప్రతిపక్ష పార్టీలు వ్యూహంగా కన్పిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ప్రజా చైతన్య యాత్రలకు పిలుపునిచ్చింది. అలాగే బీజేపీ-జనసేనలు కూడా ఉమ్మడిగా పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నాయి.

 

ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఆలోచనలు.. పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలు ఆ విధంగా ఉంటే.. ప్రభుత్వ పెద్దల ఆలోచన మరోలా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏడాదిలోగా అన్ని రకాల ఎన్నికలను పూర్తి చేసుకొని.. మిగిలిన నాలుగేళ్ల పాటు పూర్తి స్థాయి పరిపాలనపై ఫోకస్ పెట్టాలనేది సర్కార్ భావన. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న క్రమంలో రాజకీయాల కంటే పరిపాలనపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందనేది సీఎం జగన్ ఆలోచన అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కూడా ఇదే రకమైన ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రం ఎదుర్కొనే పరిస్థితే ఉంటే.. దాన్నే ప్రతిపక్షాలు ప్రధాన అస్త్రంగా తీసుకునే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలే కాకుండా.. సహకార సంఘాలు.. నీటి సంఘాల ఎన్నికలను కూడా పూర్తి చేసేసుకోవడం ద్వారా పూర్తి స్థాయి పాలనపై ఫోకస్ పెట్టాలని సర్కార్ భావిస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: