తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఇప్పుడు ఎక్కడ లేని భయాందోళనలు రేకెత్తుతున్నాయి. పార్టీ కోసం తాము ఎంతో చేసినా పార్టీ తమకు ఏం చేసింది ? అవసరమైన సమయంలో హ్యాండ్ ఇస్తోంది అనే భావన తెలుగు తమ్ముళ్లలో ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధినేత చంద్రబాబు ఆదేశాలతో పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ, ప్రజా పోరాటాలు చేస్తుండడం, పార్టీ సూచనల మేరకు రాజకీయ ప్రత్యర్ధులను విమర్శిస్తూ వారికి టార్గెట్ గా మారడంతో అనవసరంగా కొన్ని కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తోంది. అలా చిక్కుకున్నా అధినేత నుంచి కానీ, పార్టీ నుంచి గాని ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడం, కనీసం ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే భరోసా ఇచ్చే నాయకుడు కొరవడడంతో ఇప్పుడు పార్టీ కార్యక్రమాలు అంటే నాయకులు బెంబేలెత్తిపోతున్నారు.

 

 ఈ క్రమంలో పార్టీకి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓటమి చెందినా నాయకులు మాత్రం పార్టీ పైన, అధినేతపైన గౌరవంతో ఇంకా యాక్టివ్ గా ఉంటూ పార్టీ ఉనికిని కాపాడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి.ఇలా అనేక ఇబ్బందులు వీరంతా ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ప్రతి జిల్లాలోనూ కనిపిస్తోంది. తాజాగా మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మాజీ మంత్రి  అచ్చెన్నాయడు ఈఎస్ఐ మందుల కుంభకోణంలో చిక్కుకున్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఉన్నారు. 

 


ఇక ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవిపైన గనులపైనా 300 కోట్ల వరకు జరిమానా విధించింది. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కరణం బలరాం పైన కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల టిడిపి నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పార్టీ నుంచి గాని, అధినేత నుంచి గానీ ఎటువంటి భరోసా లభించకపోవడంతో వీరంతా ఆవేదనగా ఉన్నారు. పార్టీ కోసం ఎంత చేసినా అధినేత పట్టించుకోకపోవడంపై వారు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: