ఆంధ్ర‌ప్ర‌దేశ్ లెజిస్లేటివ్ రాజ‌ధాని విశాఖ‌ప‌ట్నం స్థానిక సంస్థల ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. మహా విశాఖ నగర పాలక సంస్థకు(జీవీఎంసీ) దాదాపుగా 13 ఏళ్ల తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 98 వార్డులు ఉన్నాయి. ఎప్పుడో వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు 2007లో ఎన్నిక‌లు జ‌రిగాయి. అప్పుడు కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ రాలేదు. అయితే నాడు ఇంటిపెండెంట్ల మ‌ద్ద‌తుతో కాంగ్రెస్ మేయ‌ర్ పీఠం ద‌క్కించుకుంది. ఇక ఇప్పుడు 13 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వైసీపీతో పాటు టీడీపీ నేత‌లు, అటు జ‌న‌సేన‌, బీజేపీ వాళ్లు కూడా ఆసక్తితోనే ఉన్నారు.



ఏపీలో వైసీపీ చిత్తు చిత్తుగా టీడీపీని ఓడించినా విశాఖ న‌గ‌రంలో మాత్రం నాలుగు స్థానాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థులే ఉన్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీకి కాస్త ప‌ట్టు ఉండ‌డంతో ఇప్పుడు ఆ పార్టీ వాళ్లు కూడా పోటీకి ఉత్సాహం చూపుతున్నారు. దీంతో పాటు జ‌న‌సేకు గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ భారీగా ఓట్లు ప‌డ‌డం... బీజేపీకి కూడా మంచి ప‌ట్టున్న సిటీ కావ‌డంతో విశాఖ‌లో అన్నీ పార్టీలు ల‌క్ ప‌రీక్షించుకుంటున్నాయి. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే ఇక్క‌డ ఎన్నిక‌ల‌కు ముందు ఫ్యాన్ స్పీడ్ ధాటికి మిగిలిన పార్టీలు అన్నీ తునాతున‌క‌లు అవుతున్నాయి.



ఉత్త‌రాంధ్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయి రెడ్డి మంత్రాగంతోనే గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ తిరుగులేని విజ‌యం సాధించింది. ఇప్పుడు ఇక్క‌డ విజ‌య సాయి మ‌ళ్లీ మంత్రాగం వేయ‌డంతో ఇప్ప‌టికే టీడీపీ మాజీ ఎమ్మెల్యే రెహ‌మాన్ వైసీపీ గూటికి చేరిపోయారు. జ‌న‌సేన‌, టీడీపీ కీల‌క నేత‌లు అంతా వైసీపీలోకి వ‌చ్చేస్తున్నారు. ఇక ఇప్పుడు గాజువాక మాజీ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస‌రావు సైతం వైసీపీ బాట‌లోనే ఉన్నారు. ఇక విశాఖ‌కే చెందిన మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి ట‌చ్లోకి ఉన్న‌ట్టు టాక్‌. ఏదేమైనా విజ‌య‌సాయి మంత్రాగం విశాఖ‌లో ఓ రేంజ్‌లో వ‌ర్క‌వుట్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: