రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తూనే రైతులకు, ప్రజలకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోంది. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి పండ్లు కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కర్నూలు జిల్లాలో 100 రూపాయలకు 5 రకాల పండ్లు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 
 
ఉద్యాన శాఖ రైతుల నుంచి పండ్లను కొనుగోలు చేసి... ప్రజలకు అతి తక్కువ ధరలకే రైతు మార్కెట్ల ద్వారా పంపిణీ చేస్తోంది. రెడ్ జోన్ ప్రాంతాలలో అధికారులు ప్రజలకు 100 రూపాయలకే 5 రకాల పండ్లు అందిస్తున్నారు. కర్నూలు జిల్లా యంత్రాంగం ప్రజల్లో రోగ నిరోధక శక్తిని పెంచాలనే ఉద్దేశంతో అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం 100 రూపాయలకే 8 అరటి పండ్లు, 5 స్వీట్ ఆరెంజ్, ఒక కర్బూజా, బొప్పాయి, 5 నిమ్మకాయలు అందిస్తున్నారు. 
 
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు ప్రజలకు తక్కువ ధరకే పళ్లు దొరుకుతున్నాయి. ఇప్పటివరకు కడప, కర్నూల్ రైతు బజార్లలో ఉద్యాన శాఖ ప్రజలకు తక్కువ ధరకే పండ్లు అందించేందుకు సంబంధించిన పనులు ప్రారంభించింది. కడప జిల్లా రైతు బజార్లలో 12 అరటిపండ్లు 5 రూపాయలకే ఉద్యాన శాఖ అందిస్తోంది. 
 
కరోనా సమయంలో రైతులు నష్టపోకుండా... ప్రజలకు మేలు చేకూరేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఈ మూడు జిల్లాల్లో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వైరస్ వేగంగా విజృంభిస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.       

మరింత సమాచారం తెలుసుకోండి: