భారత్, చైనా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అయితే చైనా రాయబారి మాత్రం సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇటు మోడీ భారత్ ను ఎవరూ కన్నెత్తి చూసే సాహసం చేయలేరంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వార్నింగ్ ఇచ్చారు. మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్టు రెండు దేశాలకూ సమాచారం ఇచ్చామని ట్రంప్ చేసిన ట్వీట్ కూడా హాట్ టాపిక్ గా మారింది. 

 

కరోనా టైమ్‌లో చైనా కాలు దువ్వుతోంది. కొద్ది రోజులుగా సరిహద్దుల్లో భారత్ ను చీకాకు పెడుతోంది. మన బలగాల్ని ఉద్దేశపూర్వకంగా కవ్విస్తూ.. కుటిల నీతికి తెరతీసింది. ప్యాంగాంగ్ సరస్సుతో పాటు సిక్కిం దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొంది. గతంలో ఎప్పుడూ ఆక్రమణలు జరగని గాల్వన్ ప్రాంతంలోకి చైనా సేనలు చొచ్చుకురావడాన్ని దుస్సాహసంగానే భావించాలని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే సరిహద్దుల్లో రోడ్లు, ఎయిర్ బేస్ విస్తరించుకుని అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది డ్రాగన్ దేశం. అందుకే సైన్యం ప్లీనరీలో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పిలుపునిచ్చారు. సాధారణంగా అధ్యక్షుడు ఎప్పుడూ సైన్యానికి ఇలాంటి సందేశమే ఇస్తారనే మాట నిజమే అయినా.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పుడు.. జిన్‌పింగ్ హెచ్చరికలు భారత్‌కేననే ఊహాగానాలు వస్తున్నాయి. 

 

2017 డొక్లాం ప్రతిష్ఠంభనను శాంతియుతంగా డీల్ చేసిన కేంద్రం.. ఈసారి కూడా చైనాతో సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భావించింది. ఇటీవల ప్రధాని మోడీ నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి భేటీలో ఇదే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇదంతా జిన్ పింగ్ వ్యాఖ్యల ముందు సంగతి. ఎప్పుడైతే చైనా అధ్యక్షుడి నుంచి యుద్ధం అనే మాట వచ్చిందో.. వెంటనే కేంద్రం కఠిన వైఖరి తీసుకుంది. సరిహద్దుల్లో భారత్ సైన్యం చేస్తున్న రోడ్డు నిర్మాణ పనులు కొనసాగించి తీరాలని తీర్మానించింది. మోడీ భారత్ పై కన్నెత్తి చూడటం ఎవరితరమూ కాదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక్క ముక్కలో తేల్చేశారు. 

 

ఇటు భారత్ లో చైనా రాయాబారి మాత్రం సరిహద్దు సమస్యను తగ్గించి చూపే ప్రయత్నం చేశారు. భారత్, చైనా సంబధాలకు 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా కాన్ఫడరేషన్ ఆఫ్ యంగ్ లీడర్స్ నిర్వహించిన మీటింగ్ లో పాల్గొన్న ఆయన.. సమస్యల్ని చర్చలతో పరిష్కరించుకోవాలని సన్నాయి నొక్కులు నొక్కారు. 

 

మొన్నటి దాకా ఇండియా, పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తానని అత్యుత్సాహం ప్రదర్శించిన ట్రంప్.. ఇప్పుడు చైనా, ఇండియా మధ్య డీల్ కుదురుస్తానని ట్వీట్ చేశారు. రెండు దేశాలకూ ఈ విషయంపై సమచారం ఇచ్చామన్నారు. ఓవైపు వారం రోజుల్లో చైనాపై కఠిన చర్య తీసుకుంటామని ట్వీట్ చేసిన ట్రంప్.. మరోవైపు భారత్, చైనా మధ్య మధ్యవర్తిత్వం చేస్తామనడంతో.. సరిహద్దుల్లో ఏదో జరగబోతోందన్న వాదనకు మరింత బలం చేకూరినట్టైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: