ఏపీలో జులై 15 నుంచి షూటింగులకు అనుమతిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా టైమ్ లో థియేటర్లకు ఫిక్స్‌డ్ విద్యుత్ ఛార్జీలు కూడా రద్దు చేసింది. ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన సినీ ప్రముఖులు.. సినిమా షూటింగులకు ఉచితంగా పర్మిషన్ ఇస్తూ జారీ చేసిన జీవోకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో ఇండస్ట్రీ అభివృద్ధిపైనా చర్చించారు. 

 

సినీ పరిశ్రమకు ఎలాంటి సహకారం కావాలన్నా ముందుంటామని ఏపీ సీఎం జగన్.. సినీ పెద్దలకు భరోసా ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు.. ముఖ్యమంత్రిని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో కలిశారు. చిరంజీవితో పాటు నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేశ్‌బాబు, సి.కల్యాణ్‌, దిల్‌రాజు సీఎంతో భేటీ అయ్యారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై చర్చించారు. 

 

అంతకుముందు హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం వచ్చిన సినీ ప్రముఖులు.. అక్కడి నుంచి బీజేపీ నేత గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ కు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు బస చేసిన తర్వాత సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రంలో ఉచితంగా సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 

 

కరోనా ప్రభావంతో సినీ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుందని సినీ పెద్దలు సీఎం జగన్ దృష్టికి తెచ్చారు.  దాదాపు మూడు నెలల పాటు సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయని గుర్తు చేశారు. సినిమా రంగం పూర్వ వైభవం సాధించాలంటే తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. కరోనా టైమ్ లో థియేటర్లకు ఫిక్సుడు విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. 

 

విశాఖ స్టూడియోలు, ల్యాబ్‌ల నిర్మాణానికి అనుకూల ప్రదేశం కావడంతో తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని సినీ పెద్దలు సీఎంను కోరారు. దీనిపై కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. స్టూడియోలు, ఇళ్లు నిర్మించుకోవడానికి సినీ పెద్దలు ముందుకొస్తే.. విశాఖలో తక్కువ రేటుకే స్థలాలిస్తామని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. జులై 15 నుంచి షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. విధివిధానాల ఖరారు కోసం సినీ పెద్దలు మరోసారి అధికారులతో సమావేశమవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: