దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. చాప కింద నీరులా వ్యాపిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ప్రతిరోజూ దేశంలో వేలసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాల ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో భారత్ వ్యాక్సిన్ రేసులో సత్తా చాటుతోంది. మన దేశానికి చెందిన ఏడు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ రేసులో ముందున్నాయి. 
 
భారత్ బయోటెక్, జైడస్ కాడిలా, సెరమ్ ఇన్సిట్యూట్, బయోలాజికల్ ఈ, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, పనాసియా బయోటెక్, మైక్వాన్స్ కరోనా వ్యాక్సిన్ గురించి పరిశోధనలు చేసున్నాయి. భారత్ బయోటెక్ హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తుండగా కోవాగ్జిన్ తొలి, రెండో దశ ప్రయోగాలకు అనుమతులు లభించాయి. వారం రోజుల క్రితం ఈ సంస్థ మనుషులపై ప్రయోగాలు మొదలుపెట్టింది. 
 
సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రాజెనెకా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తొలి, రెండో దశ ట్రయల్స్ లో మంచి ఫలితాలను సాధించింది. 2020 చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని ఈ సంస్థ చెబుతోంది. జైడస్ కేడిలా సంస్థ జైకోవ్ డి పేరుతో వ్యాక్సిన్ ను తయారు చేసింది. రాబోయే 7 నెలల్లో ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ పూర్తి కానున్నాయి. పనాసియా బయోటెక్ కంపెనీ అమెరికాకు చెందిన రెఫాన్ ఇంక్ కంపెనీతో జత కట్టి ప్రయోగాలను ప్రారంభించింది. 
 
2021 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఈ సంస్థ చెబుతోంది. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ సంస్థ ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో వ్యాక్సిన్ గురించి ఒప్పందాలు కుదుర్చుకుంది. బయోలాజికల్ ఈ, మైక్వాన్స్ సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తున్నాయి. అయితే ఈ సంస్థల పరిశోధనల ఫలితాల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వ్యాక్సిన్ పూర్తిస్థాయి ట్రయల్స్ లో ఈ కంపెనీలలో ఏది విజయం సాధించడం భారత్ కరోనాను కట్టడి చేయడంతో పాటు ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్లను సరఫరా చేస్తుంది. 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: