తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఎలా రాజకీయం చేస్తారో అంతుపట్టదు. ఆయన ఎప్పుడు ఎవరిని పొగుడుతారో, ఎవరిని తిడతారో అర్ధం కాదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా.. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ‌డంలో కొత్తేముందని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేసీఆర్‌ను ద‌గ్గ‌ర‌గా చూస్తే.. ఆయ‌న భిన్న‌మైన వ్య‌క్తిత్వం స్ప‌ష్టంగా క‌నిపిస్తూ ఉంటుంది.

ఒకటి త‌న‌కు రాజ‌కీయంగా ఎదురు ఉండ‌కూడదు. రెండు త‌నకు ఎదురు చెప్పేవారు ఉండ‌కూడదు. ప్ర‌తి మాట‌లోనూ త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాన్ని, ప్ర‌తి అడుగులోనూ త‌న రాజ‌కీయ శ‌క్తిని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తార‌న‌డంలో సందేహం లేదు. ఇప్పుడు ఇదే విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌తో ఆయ‌న క‌య్యానికి కాలుదువ్వుతూనే.. ఏపీనే త‌న‌పై కాలుదువ్వుతోంద‌ని ఎదురు ప్ర‌చారం చేస్తున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్ ఎత్తును పెంచ‌డం ద్వారా శ్రీశైలం జ‌లాల‌ను అటు త‌ర‌లించి సీమ‌కు అందించాల‌నేది జ‌గ‌న్ వ్యూహం.

నిజానికి దీనివ‌ల్ల తెలంగాణ‌కు ఒన‌గూరే న‌ష్టం, జ‌రిగే క‌ష్టం ఏమీ ఉండ‌ద‌ని నిపుణులు కూడా అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. నిర్దేశిత జ‌లాల లెక్క‌లను మించి ఇప్ప‌టి వ‌ర‌కు వాడుకుంటున్న తెలంగాణ‌కు ఇది ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారి.. తొలుత దీనిపై వీధికెక్కింది కేసీఆర్ పార్టీ నేత‌లే. ఈ విష‌యం కేసీఆర్‌కు తెలియ‌ద‌ని అనుకోలేం. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌కు ఆగ్ర‌హం వ‌చ్చి.. శ్రీశైలం నుంచి లెక్క‌కు మించి కేసీఆర్ తోడేస్తున్న విద్యుత్ విష‌యాన్ని వెలుగులోకి తెచ్చి.. కేంద్రం ద‌గ్గ‌ర పంచాయ‌తీ పెట్టారు. కానీ, ఇప్పుడు మాత్రం మేం ఆకేసి.. అన్నం పెడితే.. మా కంట్లోనే వేలు పెట్టేలా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కేసీఆర్ రివ‌ర్స్ ఎటాక్ చేస్తున్నారు.

మ‌రి అదే జ‌గ‌న్‌.. స్వ‌యంగా మిమ్మ‌ల్ని ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి పిలిచి ఆకేసి అన్నం పెట్ట‌లేదా ?  చెప్పేవాడు అదేదో అయితే.. వినేవాడు వెంగ‌ళ‌ప్ప అన్న సామెత‌ను కేసీఆర్ రుజువు చేస్తున్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాల‌నే కేసీఆర్‌.. ఆదిశ‌గా పెద్ద‌రికాన్ని అందిపుచ్చుకుని ఉంటే.. కృష్ణారివ‌ర్ బోర్డే.. ఎలాంటి ఫిర్యాదులు స్వీక‌రించకుండా.. స్వ‌యంగా ప‌రిశీలించి.. ప‌రిస్థితి అదుపు చేసుకోవాలంటూ.. కేసీఆర్ స‌ర్కారును ఎందుకు హెచ్చ‌రించాల్సి వ‌చ్చింది?  ఇది కూడా రాజ‌కీయ‌మేనా?!  మీరు చెప్పేదే మంచి.. చేసేదే రాజ‌కీయం అనుకోడానికి ఇది తెలంగాణ కాదు.. అంటున్నారు ఏపీ ప్ర‌జ‌లు. మ‌రి ఈ నీటిపై మాటల యుద్ధం ఎంతవరకు వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: