ఏటా దేశవ్యాప్తంగా నెలరోజుల ముందు నుంచే దీపావళి సందడి కనిపిస్తుంది. శివకాశి సహా పలుచోట్ల నుంచి భారీ ఎత్తున టపాసులు తెచ్చి, వ్యాపారులు విక్రయాలకు సిద్ధమవుతారు. పదిహేను రోజుల ముందు నుంచే అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకుని, అమ్మకాలు సాగిస్తారు. అయితే ఈ సారి కరోనా వైరస్ ఎఫెక్ట్.. దీపావళి పండుగ సంబరాలపై నీళ్లు చల్లింది. శీతకాలం, వైరస్ ఎఫెక్ట్ ఉండే ప్రమాదం ఉండడంతో.. ప్రభుత్వాలు పండుగలపై ఆంక్షలు విధించాయి. దీనిలో భాగంగా దీపావళి కూడా .. రెండు గంటలు మాత్రమే క్రాకర్స్ కాల్చుకోవాలని నిబంధన విధించారు.
పెరిగిన వాయుకాలుష్యంతో ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు బాణాసంచాపై బ్యాన్ విధించాయి. దీంతో అక్కడి వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్ లేకపోవడంతో.. వ్యాపారులు పెద్దఎత్తున సరుకు కొనుగోలు చేశారు. తీరా ఇప్పుడు రెండు గంటలే క్రాకర్స్ కాల్చాలని ప్రభుత్వాలు చెప్పడంతో వ్యాపారుల్లో ఆందోళన కొనసాగుతోంది.
కరోనా వైరస్ కారణంగా నిబంధనలు పాటిస్తూ షాపులు ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ, కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుంచి షాపులదగ్గరకు వచ్చి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. గతంతో పోలిస్తే చాలా తక్కువ టపాసులు కొని మమ అనిపిస్తున్నారు. జనం పెద్దగా రాకపోవడంతో షాపులు వెలవెలబోతున్నాయి. వేలకు వేలు పెట్టి షాపులు పెట్టామని.. ఇప్పుడు అంతా నష్టపోతున్నామంటున్నారు వ్యాపారులు. రాత్రి 8 నుంచి పది గంటల వరకూ రెండు గంటలు మాత్రమే క్రాకర్స్ కాల్చుకోవాలన్న ప్రభుత్వ ఆంక్షలతో.. కొనుగోళ్లు తగ్గి , షాపులు వెలువెలబోతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి