తెలంగాణలో భారీగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టబోతున్నట్టు ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఈ వరాన్ని వీలైనంత త్వరగా అమలులో పెడతామని కేటీఆర్ కూడా తేల్చి చెప్పారు. ఎన్నికల కోడ్ కూయకముందే నియామక ప్రక్రియ మొదలు పెడతామన్నారు. అయితే టీచర్  పోస్ట్ ల భర్తీ విషయంలో మాత్రం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు నిరుద్యోగులను నిరాశలోకి నెట్టేస్తున్నాయి. పాఠశాలల హేతుబద్ధీకరణ పేరుతో జరుగుతున్న కార్యక్రమం వల్ల ఉపాధ్యాయ పోస్ట్ ల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే.. టీచర్ పోస్ట్ ల భర్తీకోసం ఎదురు చూస్తున్న బీఎడ్, డీఎడ్ అభ్యర్థులకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది.

ప్రస్తుతం ఉన్నలెక్కల ప్రకారం సుమారు 8వేల పోస్ట్ లకు టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ జరగాల్సి ఉంది. గతంలో డీఎస్సీ నిర్వహిస్తున్నా.. కొత్తగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ని కలుపుకొని టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ 8వేల పోస్ట్ లు, హేతు బద్ధీకరణ జరిగితే కేవలం 5వేల పోస్ట్ లుగా మిగిలిపోతాయి. అంటే 3వేల పోస్టుల్లో కోత పడుతుందనమాట. ఎప్పటినుంచో బీఈడీ, డీఈడీ పూర్తిచేసుకుని రిక్రూట్ మెంట్ టెస్ట్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులందరికీ హేతుబద్ధీకరణ భయం పట్టుకుంది. పిల్లలు లేని స్కూళ్లను ఒకదానితో ఒకటి జత చేసి, హేతుబద్ధీకరణలో భాగంగా స్కూళ్ల సంఖ్యను కుదిస్తే, ఆటేమేటిక్ గా ఉపాధ్యాయుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఖాళీలు కనిపించవు. ఇలా 3వేల పోస్ట్ లకు పైగా కోతపడే అవకాశం ఉంది. దీంతో ఉపాధ్యాయ పోస్ట్ లకోసం ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగుల్లో కలవరం మొదలైంది.

మరోవైపు తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టీఆర్‌టీ) నిర్వహించడానికి కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టెట్‌ నిర్వహించకుండా పోస్టులను భర్తీ చేస్తే అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ముందుగా టెట్‌ నిర్వహించడంపై విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధ్యాయ ఖాళీలు 8వేల వరకు ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. అయితే వాటిల్లోనూ మార్పులు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ పాఠశాలల హేతుబద్దీకరణ చేపడితే పోస్టుల సంఖ్య 5వేలకు మించకపోవచ్చని అంటున్నారు. అలాగే అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తే మాత్రం 12వేలకు పైగా పోస్టులు రావచ్చని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: