ఏపీ సీఎం జగన్ ,ఏపీ ఎన్నికల ప్రధాన కమిషనర్‌ మధ్య ప్రచ్చన్న యుద్ధం సంగతి తెలిసిందే. ప్రచ్ఛన్నం ఏమీ లేదు.. అంతా ఓపెనే.. ప్రభుత్వానికి చెప్పా పెట్టకుండా కరోనా కారణంతో స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేయడంతో మొదలైన యుద్ధం.. దాదాపు ఏడాది అవుతున్నా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత జగన్ నిమ్మగడ్డను ఆ పదవి నుంచి పరోక్షంగా పీకేయడం.. మరో జస్టిస్‌ కనకరాజ్‌ను తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టడం.. ఇంతలో నిమ్మగడ్డ కోర్టుకెక్కడం.. కోర్టు ఆదేశాలతో మళ్లీ పదవి చేపట్టడం అంతా సినీఫక్కీలో సాగిపోయాయి.

కోర్టు ఆదేశాలతో పదవి దక్కినా.. కరోనా కారణంగా ఎన్నికలు పెట్టడం కుదరదంటూ జగన్ ఎన్నికలు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ లోపు.. నిమ్మగడ్డ ఓ హోటల్లో కామినేని శ్రీనివాస్‌, సుజనా చౌదరిని కలవడం వివాదాస్పదమైంది. ఇక నిమ్మగడ్డ ఒకటి, రెండు నెల్లలో పదవి నుంచి దిగిపోతారని.. అప్పటి వరకూ ఎన్నికలు జరపకూడదని జగన్ సర్కారు డిసైడైపోయంది. అయితే పదవి నుంచి దిగిపోయే ముందు జలక్ ఇవ్వాలనుకున్నారో ఏమో నిమ్మగడ్డ మరో సాహసం చేశారు.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. జనవరి 23న తొలి దశ,27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 5,9,13,17న రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. అయితే ఏపీ సీఎస్‌తో భేటీ జరిగిన కొద్దిసేపటికే ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరించి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగాల్సి ఉన్నందున ఎన్నికలు వాయిదా వేసుకోవాలంటూ ఎస్‌ఈసీని‌ సీఎస్‌ కోరినా పెద్దగా ఫలితం లేకపోయింది.

మరి ఇప్పుడు జగన్ సర్కారు ఏం చేస్తుంది.. ఎన్నికలు ఆపేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా.. లేక సహాయ నిరాకరణ చేస్తుందా..అన్నది చూడాలి. ఎవరి పంతం నెగ్గుతుందో మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: