తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్నికలంటేనే కంగారు పడి పోతుంది.ఈ మధ్యకాలంలో వరుసగా ఎదురు దెబ్బలతో ఆ పార్టీలో మరింత కంగారు మొదలయ్యింది. ఈ ఎన్నికల ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా ఉంటుంది అనే విషయాన్ని టిఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. అందుకే రాబోయే అన్ని ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే అనేక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో విజయం సాధించే విషయంపై ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఎక్కడా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకపోవడంతో , క్షేత్రస్థాయిలో బలం పెంచుకుని ప్రచారానికి దిగడం ద్వారా, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి కంగారు పడనవసరం లేదు అనే లెక్కల్లో  టీఆర్ఎస్ ఉంది.





 వరంగల్ ఖమ్మం నల్గొండ , మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్, పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవీకాలం వచ్చే మార్చి 29 తో ముగియనున్న నేపథ్యంలో  స్థానాలకు ఫిబ్రవరి నెలాఖరు మార్చిలో ఎన్నికలు వస్తాయని టిఆర్ఎస్ అంచనా వేస్తోంది. వరంగల్ , ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం త్వరలోనే ముగియనుంది.ఇక వీటితో పాటు ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక కూడా త్వరలోనే ఉండడంతో , వీటన్నిటిపైనా దృష్టిపెట్టింది. ఎమ్మెల్యేలు , ఎంపీలు, మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు అంత జనాల్లోకి వెళ్లాలని పార్టీ తరుపున ప్రచారానికి దిగాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయాలని, గెలుపు బాధ్యత తీసుకోవాలి అనే ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రజా ప్రతినిధులు జనం బాట పట్టి తమ సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. ఫలితాలు తేడా వస్తే జరగబోయేది ఏంటో తెలుసు కాబట్టే  టెన్షన్ పడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: