ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎన్నికల వేళ కొత్త కొత్త సవాళ్లతో అట్టుడికిపోతోంది. ముగిసిన పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ ఎక్కువ పంచాయతీ స్థానాలను కైవసం చేసుకుని మరోసారి ప్రజలు తమ వైపే ఉన్నారని నిరూపించుకున్నారు. ఈ ఎన్నికలలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీడీపీ కి భంగపాటు తప్పలేదు. ఎన్నడూ లేనంతగా ప్రజల ఆగ్రహానికి చంద్రబాబు పార్టీ గురైందని చెప్పవచ్చు. మరో వైపు జనసేన కొంత మేరకు తమ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లిందని చెప్పవచ్చు. దీనికి నిదర్శనమే మెరుగైన రీతిలో పంచాయతీలను గెలుచుకోవడం. ఇక బీజేపీ పరిస్థితి సరే సరి...అత్యుత్సాహంతో తెలంగాణలో వచ్చిన రెస్పాన్స్ ఏపీలో కూడా వస్తుందని ఊహించి భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు నిరాశ తప్పలేదు. అయితే ఇప్పుడు అన్ని పార్టీలు కొన్ని రోజుల్లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. ప్రజల మెప్పును పొందడానికి హామీలను ఇస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే ఈ ప్రచారానికి ఈ రోజుతో  గడువు ముగియనుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఏపీ లో మొత్తం 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో ముఖ్యంగా పలు చోట్ల ఏకగ్రీవ కావడంతో ఆయా ప్రదేశాలలో ఎన్నికలు జరగడం లేదు.

అంతే కాకుండా పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల మరియు మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవం కావడంతో అక్కడ పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదు. మిగిలిన నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో ఈ నెల 10న పోలింగ్‌ జరగబోతోంది. అయితే మిగిలిన ఈ కొన్ని గంటల ప్రచారాలు ఓటర్లను రాజకీయ పార్టీలు ఎంత మాత్రం ప్రభావితం చేస్తాయో చూడాలి. ఈ ఎన్నికలపై వైసీపీ మాత్రం ధీమాగా ఉంది. పంచాయతీ ఎన్నికలలో జరగిన విధంగానే, పురపాలక ఎన్నికలలో కూడా ప్రజలు మాపై నమ్మకముంచి గెలిపిస్తారని వైసీపీ శ్రేణులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి నగర పలక తీర్పు ఎవరికి అనుకూలంగా రానుంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: