మనిషికి జీవించడానికి కావలిసింది తినడానికి తిండి, తాగడానికి నీరు, ఉండటానికి నివాసం. ఇవి కనీస అవసరాలు. మన పూర్వీకుల కాలంలో ఇలానే ఉండేది డబ్బుకి మించి బంధాలు, బాంధవ్యాలకే విలువిచ్చేవారు. అలాంటిది కాలం మారుతున్న కొద్ది ప్రజల ఆలోచన విధానం కూడా మారింది. తమకు మించి ఆస్తులను పోగేసుకోవాలని  పాకులాడుతున్నారు. అధిక సంపాదన వెనుక పరుగులుతీస్తున్నారు. కొంచెం కొంచెంగా ఇది జనాల మనుగడపై మరింత ప్రభావాన్ని చూపుతూ పూర్తిగా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలెట్టారు. కొందరు ఈ మత్తులో పడకపోయినప్పటికి ఎక్కువ మంది భాందవ్యాలను పక్కన పెట్టి డబ్బులను దైవంగా భావిస్తున్నారు.  కోట్లు సంపాదిస్తున్నారు అయినా వారికి తనివి తీరడం లేదు. 

పేదవారు ఎక్కువగా ఉన్న దేశం మనది. అలాంటి మనదేశంలోనే ఎంతో మంది కోట్లకు పడగలెత్తిన ధనవంతులు ఉన్నారు. వాళ్లంతా ఈ దేశ పేద ప్రజలపై కాస్త దయ చూపితే అసలు మనదేశంలో పేదరికమే ఉండదని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. అయినా ఏ సమయంలోనూ, ఏ సందర్భంలోనూ అంత పెద్ద త్యాగాలను మనం చూడలేదు. కొందరు నాయకులు, మరికొందరు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు అప్పుడప్పుడు వారికి చేతనైనంత సాయాలను...అందిస్తూ వస్తున్నారు. అయితే ఈ కరోనా సృష్టిస్తున్న కరువు ప్రభంజనంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి మనిషి తన చేతనైనంత సాయాన్ని సహాయంకోసం ఎదురు చూసే చేతులకు అందించాలి. ఆక్సిజన్ సిలిండర్ల కొరత,  బెడ్స్ దొరక్క, సరైన వైద్యసదుపాయాలు అందక తమ ప్రాణాలను కోల్పోతున్నారు.

ఈ విషమ పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వాలది మాత్రమే భాధ్యత అని చెప్పలేం. ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆ బాధ్యత ఉంది. ఉన్నవారు లేని వారికి ఖచ్చితంగా సాయం చేయాల్సిన గడ్డు కాలం ఇది. ప్రతి ఒక్కరూ మానవత్వం తో స్పందించాల్సిన సమయం ఇది. మీ సాయం ఒకరికి ప్రాణం పోసినా అది నిజంగా గర్వించదగ్గ విషయమే. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో మరణించిన వారి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. వైరస్ భయంతో కనీసం వారి కుటుంబ సభ్యులు కూడా వారి అంతిమ సంస్కారాలు జరపడంలేదు. ఉన్నవారు లేనివారికి సాయం చేస్తే కనీసం కొద్ది మంది ప్రాణాలైనా కాపాడవచ్చు. చివరగా ఒక్క మాట...కరోనాతో మరణించిన వారికి కనీసం వారి బంధువుల చివరి చూపుకు కూడా నోచుకోవడం లేదు. అలాంటప్పుడు...

"చనిపోయాక...ఎక్కడ నీ బలగం...ఎక్కడ నీ చుట్టాలు...ఎక్కడ నీ బంధువులు మిత్రులు...ఎక్కడ నీ డబ్బు, నగలు ఆస్తులు...ఎక్కడ నీ కులపిచ్చి...ఎక్కడ నీ పరువు మర్యాదలు... నిన్ను మోసుకెళ్లడానికి నలుగురు నీ వాళ్ళు లేనప్పుడు..ఇకనైనా నీ అహాన్ని వీడు...ఇలాంటి మరణాలు చూసైనా మారండి... లేని వాడికి పట్టెడన్నం పెట్టండి"

మరింత సమాచారం తెలుసుకోండి: