ఏపీ అధికార పార్టీ వైసీపీలో లెక్క‌కు మిక్కిలిగా ఎమ్మెల్యేలు ఉన్నారు. 150 మంది(సీఎం త‌ప్ప‌) కొత్త పాత నేత‌లు ఉన్నారు. అదేస‌మ‌యంలో కొంద‌రు.. యువ నేత‌లు కూడా ఉన్నారు. అయితే.. ప్ర‌స్తుతం ఎంత మంది ప్ర‌జ‌ల సేవ‌లో ఉన్నారు. ఎంత‌మంది.. క‌రోనా విల‌యంలో ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లుస్తున్నారు?  ఎలా ఆదుకుంటున్నారు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తే.. చిత్తూరు జిల్లా తొలివ‌రుస‌లో ఉంది. అందులోనూ.. ఇక్క‌డి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మాత్ర‌మే చాలా ముందుకు వ‌చ్చి.. క‌రోనా బాధితుల‌కు సేవ‌లు అందిస్తున్నారు.


తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిలు.. ఎవ‌రూ చేయ‌ని విధంగా క‌రోనా బాధితుల‌కు అండ‌గా ఉంటున్నారు. దీంతో వీరి సేవ‌లు.. ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాయి. ఆది నుంచి చెవిరెడ్డి ప్ర‌జ‌లకు అండ‌గా ఉంటున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు క‌రోనా నేప‌థ్యంలో చెవిరెడ్డి మ‌రింత‌గా త‌న సేవ‌ల‌ను విస్తృతం చేశారు. ప‌ద్మావ‌తి న‌గ‌ర్‌లో స్వయంగా.. 100 ప‌డ‌క‌ల‌తో క‌రోనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. క‌రోనా బాధితుల‌కు అన్ని విధాలా వైద్యాన్ని చేరువ చేశారు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను కూడా పెంచారు.


దీంతో సాధ్య‌మైనంత మెరుగైన వైద్య ఇక్క‌డి బాధితుల‌కు అందుతుండ‌డంతో చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి పేరు జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. ఇక‌, ఈయ‌న‌లా.. మ‌రో ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి చేయ‌క‌పోయినా.. ప్ర‌త్యేకంగా కోవిడ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి.. వైద్య సేవ‌లు అందించ‌లేకపోయినా.. చెవిరెడ్డి క‌న్నా ఎక్కు వగా.. అనాథ క‌రోనా శ‌వాల‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన అంత్య‌క్రియ‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో క‌డుపున పుట్టిన వారే.. త‌మ వారు చ‌నిపోతే.. చూసేందుకు సైతం రావ‌డం లేదు.


ఈ నేప‌థ్యంలో.. 60 ఏళ్ల వ‌య‌సు పైబ‌డిన భూమ‌న.. ఈ అనాథ శ‌వాల‌కు గౌర‌వ ప్ర‌ద‌మైన అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా జాతీయ‌స్థాయి మీడియా దృష్టిని ఆక‌ర్షించ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 100 మృత దేహాలకు భూమ‌న‌.. అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌డం గ‌మ‌నార్హం. దీంతో అటు చెవిరెడ్డి, ఇటు భూమ‌న సేవా నిర‌తి.. వైసీపీకి ప్ల‌స్ గా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: