ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఆస‌క్తిక‌ర విష‌యంపై చ‌ర్చ సాగుతోంది. రాష్ట్రంలో అతి పెద్ద‌జిల్లాగా ఉన్న తూర్పుగోదావ‌రిలో పార్టీ పుంజుకునేలా చేయాల‌ని.. సీనియ‌ర్లు చంద్ర‌బాబుకు సూచించిన‌ట్టు స‌మాచారం. ``ఇక్క‌డ ఒక్క‌చోట పార్టీ పుంజుకుంటే.. ఆరు జిల్లాల్లో పార్టీ పుంజుకుంటుంది`` అని సీనియ‌ర్లు చెబుతున్నారు. వాస్త‌వానికి ఇది గ‌తంలోనూ అనుభ‌వంలోకి వ‌చ్చింది. 2014లో టీడీపీ తూర్పుగోదావ‌రి జిల్లాలో పుంజుకుంది. మెజారిటీ స్థానాల‌ను ఆపార్టీనే గెలుచుకుంది. బీజేపీతో పొత్తులో భాగంగా ఒక స్థానం బీజేపీకి కేటాయించినా.. మిగిలిన స్థానాల్లో మెజారిటీ స్థానాలు.. తుని మిన‌హా.. టీడీపీ ద‌క్కించుకుంది.అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం ఇక్క‌డ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది.

అయిన‌ప్ప‌టికీ.. రాజ‌మండ్రి సిటీ, రూర‌ల్ మాత్రం టీడీపీ ద‌క్కించుకుంది. ఈ రెండు స్థానాల‌కు తోడు పెద్దాపురం - మండ‌పేట స్థానాలు కూడా టీడీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ నుంచి పార్టీ పుంజుకుంటే.. ఈ ప్ర‌భావం .. కోస్తాలోని.. కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు, ప‌శ్చిమలోనూ ఉంటుంద‌ని.. తూర్పు విజ‌యంపార్టీని బ‌లోపేతం చేస్తుంద‌ని.. అంటున్నారు. అయితే.. హ‌ఠాత్తుగా ఈ చ‌ర్చ ఎందుకు వ‌చ్చింది? ఎందుకు సీనియ‌ర్లు ప‌ట్టు బ‌డుతున్నారు అనేది ఆస‌క్తిగా మారింది.

కొంచెం లోతుగా ఆలోచిస్తే.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్పుడు పార్టీ ఇంచార్జ్‌లు లేరు. ఉన్న‌వారు కూడా నైరాశ్యంలో ఉన్నారు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే ఇక్క‌డ ఇంచార్జ్‌ల‌ను నియ‌మించి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్‌లు మీకే అని పిలుపు ఇస్తే.. వారు పుంజుకుంటార‌ని.. పార్టీని బ‌లోపేతం చేస్తార‌ని.. సీనియ‌ర్లు చెబుతున్నారు. అయితే.. ఇందులోనూ.. సీనియ‌ర్లకు ఉన్న ఛాయిస్ ఏంటంటే.. వారి వార‌సులు.. వారి బంధువుల‌కు టికెట్లు ఇప్పించుకోవ‌డ‌మే. అదే ఎన్నిక‌ల స‌మ‌యానికి అయితే.. మ‌ళ్లీ పాతవాళ్లు తెర‌మీదికి వ‌స్తార‌ని.. చంద్ర‌బాబు మ‌న‌సుకూడా అటు వైపు మొగ్గు చూపే అవ‌కాశం ఉంటుంద‌ని.. అందుకే సీనియ‌ర్లు తొంద‌ర ప‌డుతున్నార‌ని చెబుతున్నారు.

నిజానికి సీనియ‌ర్ల వాద‌న వెనుక కొంత స్వార్థం అయితే.. ఉన్న‌ప్ప‌టికీ.. తూర్పు గోదావ‌రి జిల్లాలో టీడీపీ పునాదులు బ‌లంగానే ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టి నుంచి ప్ర‌త్యేక దృష్టి పెడితే.. మాత్రం.. ఈ ప్ర‌భావం.. ఇత‌ర జిల్లాల‌పై కూడా ప‌డుతుంద‌ని.. త‌ద‌ర్వా.. పార్టీ పుంజుకుంటుంద‌ని.. అంటున్నారు. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి. ఫార్ములా మంచిదే అయినా.. వ‌ర్క‌వుట్ అవుతుందా? అనేది సందేహం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: