తెలుగు రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 4గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్రో 1,29,038 క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్ ఫ్లో 1,76,535 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.80అడుగులుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 10గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులు కాగా.. ప్రస్తుతం 589.70అడుగులుగా ఉంది. మరోవైపు మంచిర్యాల ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 14గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 20.175టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 19.4530 టీఎంసీలుగా ఉంది.

ఇక జూరాల ప్రాజెక్టలోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో 16గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1,06,141 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,03,780 క్యూసెక్కులుగా ఉంది. అటు శ్రీశైలంకు కూడా నీటి ప్రవాహం కొనసాగుతుండగా అధికారులు నాలుగు గేట్లను ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుండగా.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అండమాన్ దీవుల పరిసరాల్లో 5.8కిలోమీటర్ల ఎత్తువరకు గాలులతో ఆవర్తనం ఏర్పడనుండగా.. రానున్న నాలుగు, ఐదు రోజుల్లో ఇది బలపడి ఉత్తరాంధ్ర తీరానికి వచ్చే అవకాశాలున్నాయి. దీనికి తోడు కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా అరేబియా సముద్రంపై మరో ఉపరితల ఆవర్తనం వ్యాపించింది. వీటి ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: