తెలంగాణలోని హుజూరాబాద్ లో ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తుండగా, బీజేపీ మాత్రం ఎందుకో కాస్త వెనుకబడింది. కేవలం బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ అహంకారాన్ని తగ్గించాలంటే, తనను గెలిపించాలని ఈటెల ప్రచారంలో ప్రజలను కోరుతున్నారు. అధికార పార్టీ ఆగడాలను అడ్డుకోవాలంటే బీజేపీకే సాధ్యమంటూ ముందుకెళ్తున్నారు. అయితే హుజూరాబాద్ లో ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తున్నా.. ఇప్పటి వరకూ బీజేపీ నుంచి పెద్దలెవరూ ప్రచారానికి హాజరు కాలేదు.

అయితే గతంలో దుబ్బాక ఎన్నికల సమయంలో కమలదళం ప్రచారంలో దూకుడుగానే వెళ్ళింది. అప్పట్లో దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ తరపున బీజేపీ పార్టీ చీఫ్ బండి సంజయ్ విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ ఎంపీలు అరవింద్, సోయం బాపురావు రోడ్ షోలు కూడా చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ప్రచారం చేశారు. కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు మాజీ ఎంపీ వెంకటస్వామి, మాజీ ఎంపీ జితేందర్ రెడీ కూడా బీజేపీకి ప్రచారం చేశారు. దుబ్బాక ఎన్నికల సమయంలో ఏకంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. బీజేపీని గెలిపించాలంటూ ప్రచారం చేసి.. చివరకు విజయం సాధించారు.

హైదరాబాద్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ బీజేపీ బడా నేతలు భారీగానే తరలివచ్చారు. అమిత్ షా రోడ్ షో చేశారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఎన్నికలకు మాత్రం పెద్ద నేతలెవరూ రావడంలేదు. అయితే బీజేపీ నేతలు రాకపోవడానికి కారణం దేశంలో పెరుగుతున్న ధరలే కారణమని తెలుస్తోంది. ఇప్పటికే ప్రజల్లో రైతు చట్టాలపై వ్యతిరేకత ఉంది. మరోవైపు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ప్రతీరోజూ పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ప్రచారానికి వస్తే.. అది కాస్తా ఈటెలకు మైనస్ అవుతుంది. అందుకే బీజేపీ అగ్రనేతలెవరూ హుజూరాబాద్ ప్రచారానికి రాలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: