కొవిడ్ మృతుల కుటుంబాలకు 50వేల రూపాయల చెల్లింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించేందుకు ఆదేశాలిచ్చింది. ఇందుకు కలెక్టరేట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని చెప్పింది. మృతుల జాబితా రూపొందించి చెల్లింపులు చేయాలని సూచించింది. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ కు దరఖాస్తు తీసుకున్న 2వారాల్లోగా పరిహారం చెల్లించాలని తెలిపింది.

దరఖాస్తులో పేరు, మృతుడితో బంధుత్వం, చనిపోయిన ప్రదేశం, చిరునామా, ఆధార్ నెంబర్, ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్, డెత్ సర్టిఫికేట్, సీడీఏసీ ఆమోదించిన నెంబర్ ను పంపాలి. కోవిడ్ మరణం నిర్ధారించే కమిటీ సర్టిఫికేట్, మృతుల కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రతిపాదనలు పంపాలి. దరఖాస్తుపై ఆశావర్కర్, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్ కూడా కౌంటర్ సంతకం చేయాల్సి ఉంటుంది. చివరగా డీఆర్ వో సైన్ చేయాలి.

ఇక ఏపీలో గడిచిన 24గంటల్లో 33వేల 944 కరోనా టెస్టులు చేస్తే.. 415మందికి పాజిటివ్ వచ్చినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న 6మంది కరోనాతో చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 20లక్షల 64వేల 287కు చేరగా.. ఇప్పటి వరకు 14వేల 356మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 584మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4వేల 655యాక్టివ్ కేసులున్నాయి.

మరోవైపు కరోనా సమయంలో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం చేసే ఉద్దేశంతో ముందుకొచ్చిన ఆనందయ్య లాంటి వాళ్లను ప్రభుత్వం స్వాగతించాలని హైకోర్టు సూచించింది. అయితే ఆనందయ్య కంటి చుక్కల మందు.. పరీక్షల్లో పాస్ కాలేదని ప్రభుత్వ తరఫు లాయర్ హైకోర్టుకు చెప్పారు. దీంతో కరోనాతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎందరు చనిపోయారో బయటపెడితే సర్కార్ ఇరకాటంలో పడుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం కరోనా బాధితులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.













మరింత సమాచారం తెలుసుకోండి: