ప్రపంచంలో పేద, ధనిక బేధాలు ఉన్నాయి. అయితే ఈ బేధాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. కొందరికి ఏళ్ల తరబడి కూర్చుని తిన్నా తరగని ఆస్తులు ఉన్నాయి. మరికొందరు రోజుకు గుప్పెడు అన్నం దొరక్క ఆకలితో మలమలమాడి ప్రాణాలు కోల్పోయే పేదరికం కూడా ఉంది. ఇంత అభివృద్ధి చెందినా ఇంకా అనేక చోట్ల ఆకలి చావులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మరి ఈ ప్రపంచంలో పేదరికం పోవాలంటే ఏంచేయాలి.. ఇందుకు ఐక్యరాజ్యసమితి ఓ షాకింగ్ సమాధానం చెప్పింది.


అదేంటో తెలుసా.. ప్రపంచంలోని ఓ వ్యక్తి తన సంపదలో కేవలం 2 శాతం ఇస్తే చాలు.. ప్రపంచంలోని ఆకలిని అంతం చేయొచ్చని చెబుతోంది ఐక్యరాజ్య సమితి.. అవును.. ప్రముఖ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సంపదలో 2% విరాళమిస్తే చాలట.. ప్రపంచంలో ఆకలి లేకుండా చేయొచ్చట. ఆయన తలచుకుంటే ప్రపంచ దేశాల్లోని కోట్ల మంది నిరుపేదల ఆకలి బాధలూ తీర్చేయొచ్చని ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బేస్లే చెబుతున్నారు.


ఆకలితో చావులకు దగ్గరగా ప్రపంచంలో 4.2 కోట్ల మంది జీవిస్తున్నారట. వీళ్లను బతికించాలంటే దాదాపు 45,000 కోట్లు రూపాయలు అవసరమని ఓ అంచనా. ఇక టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ నికర సంపద సుమారు రూ.22,00,000 కోట్లు ఉంటుందని ఓ అంచనా ఉంది. ఇందులో కేవలం  2 శాతాన్ని వెచ్చిస్తే చాలు.. నాలుగున్నర కోట్ల మందిని చావు నుంచి బయటపడేయొచ్చంటోంది ఐక్యరాజ్య సమితి.


నిజమే.. ఒక్క ఎలాన్ మాస్క్ మాత్రమే కాదు.. ప్రపంచ కుబేరులంతా తోటి వారి ఆకలి తీర్చేందుకు సాయం చేస్తే.. ప్రపంచంలోని ఆకలి చావులను నిర్మూలించొచ్చు. అందుకే కోట్ల మంది ఆకలి తీరుతుందంటే నా ఆస్తిలో 2 శాతం ఇచ్చేందుకు సిద్దం అంటున్నాడు ఎలాన్‌ మాస్క్. ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న వారి సాయం కోసం ఐక్యరాజ్య సమితి వద్ద సరైన ప్రణాళిక ఉంటే.. దాన్ని తనకు వివరించాలంటున్నారు మాస్క్.. తనకు నిధులు సద్వినియోగంపై నమ్మకం కుదిరితే తన ఆస్తిలో 2 శాతం ఇచ్చేందుకు రెడీ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: