ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రకృతి పగబట్టినట్లుంది. దాదాపు 15 రోజులుగా రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాయలసీమ ప్రాంతం వరద నీటిలో నానిపోయింది. కడప జిల్లాలో వరద కారణంగా ఇప్పటి వరకు 40 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు వరద తాకిడికి తెగిపోయాయి. వందల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేల ఎకరాల్లో పంట నీటి పాలైంది. ఇక తిరుపతి పట్టణంలో రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుమలకు వెళ్లే అన్ని మార్గాలను అధికారులు రెండు రోజుల పాటు మూసివేశారు. అటు నెల్లూరు జిల్లాలో కూడా వరద భీభత్సం సృష్టించింది. వరద తాకిడికి రోడ్లు కొట్టుకుపోయాయి. ఇప్పుడిప్పుడే వరద నుంచి కోలుకుంటున్న ఏపీ ప్రజల నెత్తిపై మరో పిడుగు పడుతోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నవంబర్ 30వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం... వాయువ్య దిశలో పయనిస్తుందని... పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద డిసెంబర్ 2వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు.. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి జవాద్ అనే పేరు పెట్టినట్లు అధికారులు తెలిపారు. అలాగే తుపాను తీరం దాటే సమయంలో వంద నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీ వరకు సముద్రం అల్లకల్లోల్లంగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని ఇప్పటికే మత్య్సకారులను అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు అండమాన్ తీరంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసినట్లు తెలిపారు. మరో మూడు రోజుల పాటు అల్ప పీడన  ప్రభావం ఉంటుందని... ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: