ఆరు నూరైనా కుప్పం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈమధ్య కుప్పంలో బాబు కూసాలు కదిలిపోయాయంటూ వైసీపీ ప్రచారం చేసింది. కుప్పం మున్సిపాల్టీ కూడా చేజారిపోవడంతో చంద్రబాబు ఇక అక్కడినుంచి పోటీ చేయరనే ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం కుప్పంను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. అక్కడినుంచే పోటీ చేస్తానని మరోసారి కన్ఫామ్ చేశారు.

వాస్తవానికి చంద్రబాబు కుప్పంకు ఆల్టర్నేట్ వెదుక్కునే పనిలో ఉన్నారని గతంలో టీడీపీ వర్గాల్లో కూడా ప్రచారం జరిగింది. కుప్పంను లోకేష్ కి అప్పగించి, తాను రాయలసీమలోనే మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచించారట. అయితే కుప్పంలో అసలుకే మోసం వస్తుందనే అనుమానంతో ఇటీవల స్థానిక ఎన్నికల ఫలితాల అనంతరం బాబు మనసు మార్చుకున్నారట. కుప్పంలో తాను కానీ, లోకేష్ కానీ ఎవరూ పోటీ చేయకుండా వేరే నియోజకవర్గాన్ని వెదుక్కోవాలనుకున్నారట. కానీ అప్పటికే మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి చంద్రబాబుకి సవాల్ విసిరారు. బాబు కుప్పం నుంచి వెళ్లిపోతున్నారని, ఆయన పోటీ చేయాలనుకుంటే తన నియోజకవర్గంలో పోటీ చేయొచ్చని, తానెక్కడికీ వెళ్లబోనని అన్నారు.

పెద్దిరెడ్డి కామెంట్స్ వైసీపీలోనే కాదు, టీడీపీలో కూడా సంచలనంగా మారాయి. చంద్రబాబుకి ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు అనుకోకుండా కుప్పంకి లాక్ అవ్వాల్సి వచ్చింది. ఓవైపు వైసీపీ చంద్రబాబు కుప్పం వదిలిపెట్టి పారుపోతున్నారనే ప్రచారం చేస్తోంది. అదే సమయంలో ఆయన నిజంగానే కుప్పంను వీడితే అది తమ నైతిక విజయంగా వైసీపీ మళ్లీ ప్రచారం చేసుకుంటుంది. అందుకే చంద్రబాబు కుప్పంకి ఫిక్స్ అవుతున్నట్టు పదే పదే ప్రకటిస్తున్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపాలన్నా, టీడీపీలో జోష్ నింపాలన్నా.. చంద్రబాబు కుప్పం నుంచే పోటీ చేయాలి. పెద్దిరెడ్డి మాటలతో చంద్రబాబు అనుకోకుండా కుప్పంకే ఫిక్స్ అవుతున్నారు. అక్కడ పార్టీ పరిస్థితి బాగోలేదని తెలిసినా కూడా అక్కడినుంచే పోటీ చేస్తున్నానంటూ ప్రకటించారు చంద్రబాబు. కుప్పంలో పార్టీని ప్రక్షాళణ చేస్తానని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: