తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాలు   దేశంలో మ‌రేరాష్ట్రంలో కూడా క‌నిపించ‌డం లేదు. ప్ర‌తిసారి సరికొత్త పథకాలతో ముందుకు సాగుతున్నారు గులాబీ బాస్‌. గత రెండు నెలలుగా రైతుల‌ చుట్టే రాజ‌కీయం కొన‌సాగుతుందన్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులను మ‌చ్చిక చేసుకునేందుకు కేసీఆర్ మ‌రోసారి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రారంభించారు. అయినా, వీటితో ఆశించిన ఫ‌లితాలు రావ‌డం లేద‌ని భావించిన కేసీఆర్‌..  ఇంకా రైతుల‌ను తమ వైపు తిప్పుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 


హుజరాబాద్ ఉప ఎన్నిక‌లో టిఆర్ఎస్ ఓటమి తర్వాత పార్టీలో అంతర్మథనం మొదలైంది. దీంతో పాటు రాబోయే ఎన్నికల వ‌ర‌కు కాషాయ పార్టీ పుంజుకుంటుందన్న‌ భయం నెలకొంది. అందుకే ఓటర్లను ప్రభావితం చేసే పథకాల కోసం అన్వేషిస్తోంది టీఆర్ఎస్ ప్ర‌భుత్వం.  ఇందులో భాగంగా రైతులకు పింఛన్ పథకాన్ని రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతుబంధు ద్వారా ప్రతి రైతుకూ ఎకరాకు పదివేలు రూపాయాల‌ను వారి అకౌంట్లో జ‌మ చేస్తోంది.  ఇప్పుడు తాజాగా రైతు పింఛను ఇచ్చేందుకు సిద్ధమవుతున్న‌ట్టు స‌మాచారం.  రైతుల‌ ఆర్థిక పరిపుష్టి సాధించాలని భావిస్తున్నారు.


దీనికిగాను ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డారు. అన్నదాతలను ఆదుకునే ఉద్దేశంతో వారికి పింఛన్లు ఇవ్వాలని భావిస్తున్నా అసలు ఉద్దేశం అది కాదు అనే వాదన కూడా వినిపిస్తోంది. రైతులకు పింఛన్ ఇస్తే ఎంత ఖర్చవుతుంది ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు.. అనే అంశాల పై నివేదిక తయారు చేస్తున్నట్లు సమాచారం. ఖజానా పై ఎంత భారం పడుతుందని.. ఇదే విషయంపై కూడా దృష్టి సారించాలని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


 రైతు బంధు పథకంలో భాగంగా 67 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో 47 ఏళ్లు నిండిన వారు ఎంతమంది.. 49 ఏళ్లు నిండిన వారు ఎంత మంది ఉన్నారనే విష‌యంపై కూడా వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. రైతు పెన్షన్ పథకానికి 47 ఏళ్లు నిండిన వారు అర్హులుగా తేల్చినట్టు తెలుస్తోంది. వీరికి నెలకు రూ.2016 ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. దీంతో ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేందుకు అస్త్రం దొరుకుతుంద‌ని టిఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రైతుబంధు ద్వారా లబ్ధి పొందాలని చూసినా అది పెద్ద‌గా వర్కౌట్ కాలేదు.. దీంతో రైతు పింఛ‌న్ స‌ఫ‌లం అవుతుందా లేదా అనే సందేహాలు క‌లుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: