ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు విపక్ష నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త పీఆర్‌సీ వివాదం తారాస్థాయిలో ఉంది. ప్రభుత్వంపై తీవ్ర ఆరోణలు చేస్తున్న ఉద్యోగ సంఘాలు... ఇప్పటికే నిరసన బాట పట్టారు. అన్ని జిల్లాల కలెక్టర కార్యాలయాల వద్ద ఉపాధ్యాయులు ముట్టడికి యత్నించారు. ఇక ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై పోరుబాట పట్టారు. ఈ రోజున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసు ఇస్తామని కూడా ఉద్యోగు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. ఇందులో ప్రధానంగా పీఆర్‌సీపై చర్చ, ఉద్యోగుల డిమాండ్ల పైనే చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన  పీఆర్‌సీపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కొత్త పీఆర్‌సీకి ఉద్యోగ సంఘాల నేతలు అంగీకరించారు. అయితే... ఆ తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం హెచ్‌ఆర్ఏ తగ్గించటంతో పాటు సీసీఏ రద్దు వంటి నిర్ణయాలపై ఉద్యోగుల్లో ఆగ్రహ జ్వాలా పెల్లుబీకింది. ప్రభుత్వ జీవోలపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సీఎస్‌తో సహా ఏపీ ఆర్థిక - జీఏడీ అధికారులు కూడా ప్రస్తుతం మీడియా ముందుకొచ్చి ఏపీ ఆర్దిక పరిస్థితిని వివరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ రోజు జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగుల పీఆర్‌సీ అంశంపైన ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా కేబినెట్‌లో తీసుకునే నిర్ణయాలను పరిశీలించిన తర్వాతే... తమ ఉద్యమ కార్యాచరణ అమలు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయులు కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ తన నిర్ణయం మార్చుకుంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశం కీలకంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: