ఏపీ ప్రభుత్వం పీఆర్సీ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. ఇప్పటికే పీఆర్సీ సహా, పదవీ విరమణ వయో పరిమితి పెంపు జీవోలకు కేబినెట్ ఆమోదముద్ర పడింది. వాటిని వెంటనే పట్టాలెక్కించడమే తరువాయి. ఆ జీవోలు అమలులోకి వస్తే పీఆర్సీపై ఉద్యోగులు చేస్తున్న పోరాటం వృథా అవుతుంది. అంటే పూర్తిగా వారికి నష్టం జరుగుతుందని కాదు కానీ.. ఇప్పటికిప్పుడు కొత్త జీతాల ప్రక్రియ అమలులోకి వస్తే.. వారి పోరాటం మరింత కాలం కొనసాగాల్సి ఉంటుంది. అందుకే వారు వెను వెంటనే సమ్మెనోటీసుకి సిద్ధమయ్యారు.

మధ్యలో నలిగిపోతున్న ట్రెజరీ ఉద్యోగులు..
వాస్తవానికి ప్రభుత్వం జీవోలు అమలులోకి తెచ్చిన తర్వాత, ఉద్యోగులకు కొత్త జీతాలు ప్రాసెస్ చేయాల్సిన పని ట్రెజరీ ఉద్యోగులపై ఉంటుంది. అంటే పీఆర్సీ జీవో అమలులోకి రావాలంటే వారు పనిచేయాల్సిందే. అయితే ఇప్పటికిప్పుడు సమ్మెలోకి వెళ్లే అవకాశం లేదు కాబట్టి.. ఉద్యోగులు పని చేయాల్సిందే. అలా ట్రెజరీ ఉద్యోగులు పని మొదలు పెడితే మొదటికే మోసం వస్తుంది. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేస్తే తమ తోటి ఉద్యోగులకు వారు అన్యాయం చేసినట్టే లెక్క. అందుకే వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా వారిపై ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

తగ్గేది లేదు..
ప్రభుత్వం తమపై ఒత్తిడి తెచ్చినా.. కొత్త బిల్లుల ప్రక్రియలో ఖజానా శాఖ ఉద్యోగులు పాల్గొనబోరని చెబుతున్నారు రాష్ట్ర ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్. ఈమేరకు ట్రెజరీ ఉద్యోగుల సంఘం నేతలు చర్చలు జరిపి ఓ ప్రకటన విడుదల చేశారు. అటు పే అండ్ అకౌంట్స్ విభాగం కూడా సహాయ నిరాకరణకు సై అంటోంది. అయితే అధికారికంగా ఉద్యోగుల సమ్మె మొదలు కాకముందే.. ఈ రెండు విభాగాలనుంచి ప్రభుత్వానికి సహాయ నిరాకరణ మొదలైనట్టే లెక్క. దీంతో ప్రభుత్వం కూడా వేచి చూసే ధోరణిలో ఉంది. ఇప్పటికిప్పుడు కొత్త బిల్లులు ప్రాసెస్ చేయకపోతే వచ్చేనెల జీతం విషయంలో సందిగ్ధత నెలకొంటుంది. పాత బిల్లలు ప్రకారమే జీతాలివ్వడానికి ప్రభుత్వం ఒప్పుకోవడంలేదు, కొత్త బిల్లుల్ని ఉద్యోగులు తిరస్కరిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: