సౌతాఫ్రికాలో గబ్బిలాల్లో గుర్తించిన నియోకొవ్ వైరస్ ఇప్పటి వరకు మనుషులకు వ్యాపించిన దాఖలాల్లేవని రష్యా మీడియా సంస్థ స్పుత్నిక్ తెలిపింది. ప్రస్తుతం జంతువుల నుంచి మాత్రమే వ్యాప్తి చెందుతుందని వెల్లడించింది. అయితే ఈ వైరస్ మ్యూటేషన్ జరిగితే మనుషులకు సోకే ప్రమాదముందని.. అప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోతారని చైనాలోని వుహాన్ సైంటిస్టులు చెప్పారు. ఇది కొవిడ్ 19 రకం కాదు కాబట్టి ప్రస్తుత టీకాలు పనిచేయవు.
ఇక తమ దేశంలో కరోనా వైరస్ పుట్టలేదని బుకాయిస్తోన్న చైనా తాజాగా ఒమిక్రాన్ విషయంలో కెనడాపై ఆరోపణలు చేస్తోంది. కెనడా నుంచి వచ్చిన ఓ పార్శిల్ ద్వారా బీజింగ్ లోకి ఒమిక్రాన్ ప్రవేశించిందని చైనా అధికారులు చెబుతున్నారు. అటు జీరో వైరస్ లక్ష్య సాధన కోసం డ్రాగన్ ప్రయత్నిస్తోంది. ఫిబ్రవరి 4 నుంచి అక్కడ వింటర్ ఒలింపిక్స్ ఉన్న కారణంగా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.
ఇతర వేరియంట్లతో పోలిస్తే ఉపరితలాలపై ఒమిక్రాన్ ఎక్కువ కాలం సజీవంగా ఉండటమే దీని వ్యాప్తికి కారణమని నిపుణులు చెబుతున్నారు. మన చర్మంపై 21గంటలకు పైగా.. ప్లాస్టిక్ పై 8రోజులకు పైగా ఈ వేరియంట్ వైరస్ జీవించగలదు. ఇక ఇథనాల్ తో చర్మంపై గల అన్ని వైరస్ లు 15సెకన్లలో పూర్తిగా నాశనం అవుతున్నట్టు జపాన్ పరిశోధకులు వెల్లడించారు.
ఒమిక్రాన్ వేరియంట్ పెద్ద ప్రమాదం కానప్పటికీ మున్ముందు ప్రమాదకరమై వేరియంట్లు వస్తాయని బోస్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాలం గడిచేకొద్దీ వైరస్ తక్కువ ప్రాణాంతకంగా మారతాయని చెప్పడానికి ఆధారాలేవీ లేవన్నారు. కుక్కలు, పిల్లులు లాంటి జంతువులల్లోకి వైరస్ ప్రవేశించి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. డెల్టా కంటే రెండు రెట్లు వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తోందని చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి