ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పుడు తాలిబన్ల రాజ్యం నడుస్తుందన్న సంగతి తెలిసిందే. అమెరికా సైన్యం ఖాళీ చేయడంతో తాలిబన్లు అక్కడి ప్రభుత్వంపై దాడి చేశారు.. దేశాధ్యక్షుడే దేశం విడిచిపోయిన తర్వాత తాలిబన్లు అధికారంలోకి వచ్చారు. పాత ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరిపిన ఇండియా తాలిబన్లు అధికారంలోకి వచ్చాక.. ఆ దేశంపై ఫోకస్ తగ్గించేసింది. తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడు భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించి దౌత్యపరమైన తాలిబన్ల అస్థిత్వాన్ని గుర్తించాలని ఆ దేశం ఆశపడుతోంది.



అందుకే తమ దేశంలో రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని తాలిబన్ల నేతలు ఇండియాను కోరుతున్నారు. తమ రాజధాని కాబుల్ లో భారత రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిపిస్తే అన్నివిధాలుగా భద్రత కల్పిస్తామని తాలిబాన్ నేతలు భారత్ కు ప్రతిపాదనలు పంపారు. తాలిబన్ రాయబారి సుహైల్ షాహీన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాలిబన్ ప్రభుత్వం ప్రపంచ దేశాలు తమను గుర్తించాలని కోరుకుంటోంది. అందుకు అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.


ఇక ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన తప్పదని గుర్తించిన భారత్.. క్రమంగా ఆ దేశానికి సాయం చేయడం కూడా ప్రారంభించింది. ఈ మధ్య మానవతా సహాయం కింద భారత్ 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను ఆ దేశానికి పంపింది. తాలిబన్లు ఈ గోధములను స్వీకరించి భారత్ కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ  నేపథ్యంలోనే తాలిబన్లు చేసిన రాయబార కార్యాలయం ప్రకటన చర్చనీయాంశమైంది.


అయితే.. భారత్ పంపిన సమయంలోనే పాక్ కూడా తాలిబన్ల ప్రభుత్వానికి గోధుమలు పంపించింది. కానీ పాకిస్తాన్ పంపిన గోధుమలు ఏమాత్రం నాణ్యంగా లేవని తాలిబాన్ నేతలు పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలిపారట. పాక్ ఇచ్చిన గోధుమలు పుచ్చిపోయాయని కూడా తాలిబాన్ నాయకులు మండిపడ్డారు. పాకిస్తాన్ అందించే సహాయంతో పోలిస్తే భారత సహాయం చాలా గొప్పదని తాలిబన్లు వ్యాఖ్యానించడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: