ఏపీలో కరెంటు చార్జీలను పెంచుతూ ఏపీఈఆర్సీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని ప్రతిపక్షం టీడీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. విద్యుత్ ఛార్జీల పెంపుని వ్యతిరేకిస్తూ.. దశలవారీగా ప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించే వరకు నిరసన బాట చేపట్టాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఊరూవాడా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడేళ్లల్లో ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని గుర్తు చేశారు చంద్రబాబు. మొత్తంగా 7 దశల్లో ప్రజలపై 12వేల కోట్ల రూపాయల భారం వేశారని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయి నుంచి, గ్రామ స్థాయి వరకు పోరాటాల కార్యాచరణ సిద్ధం చేసామన్నారాయన.
సంక్షేమం పేరుతో చార్జీల మోతా..?
టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఉండేవారిమని తెలిపారు మాజీ సీఎం చంద్రబాబు. సీఎం జగన్ అసమర్థత, అవినీతి వల్లే ఏపీలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్థమైందని చంద్రబాబు ఆరోపించారు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 25వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారని, ఆ అప్పుని ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వైసీపీపై లేదా అని ప్రశ్నించారు. ఏపీలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతూ రైతులకు ఉరితాడు బిగిస్తున్నారని మండిపడ్డారు. రైతుల్ని నిండా ముంచేశారని అన్నారు. ఇక టీడీపీతో పాటు వామపక్షాలు కూడా విద్యుత్ చార్జీల పెంపుకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టబోతున్నాయి. అటు బీజేపీ, జనసేన కూడా పెరిగిన చార్జీలకు వ్యతిరేకంగా ఆందోలన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాయి. ఈ దశలో చార్జీల పెంపు వల్ల జగన్ సాధించేదేంటి..? సంక్షేమ పథకాలతో మంచి పేరు తెచ్చుకున్న జగన్, ఇలా చార్జీల వడ్డింపుతో ఆ మంచిపేరు కోల్పోతున్నారా..? ప్రస్తుతానికి ఎన్నికలు లేవు కాబట్టి, ఎన్నికల నాటికి ఇలాంటివాటన్నిటినీ ప్రజలు మరచిపోతారు కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి