వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి హైకోర్టులో దాఖలుచేసిన కౌంటర్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి మీద సీబీఐ ఇదే ఆరోపణ చేసింది. రాజకీయ విభేదాలతోనే వివేకా హత్య జరిగినట్లు వివరించింది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ కోసం తనకు పోటీ వస్తారన్న కోపంతోనే అవినాష్, తండ్రి ఇద్దరు కలిసి వివేకా హత్యకు ప్లాన్ చేశారట. కౌంటర్లో ఏముందంటే కాంగ్రెస్ ను వదిలేసి వైసీపీలో చేరిన వివేకా 2017లో ఎంఎల్సీ ఎన్నికల్లో ఓడిపోయారట.





అప్పుడు పులివెందుల డివిజన్ బాధ్యతలను ఎంపీ సన్నిహితుడు డీ శివశంకరరెడ్డే చూశారట. శివశంకర్ ఎంఎల్సీగా పోటీచేసేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదట. అయితే టికెట్ దక్కకపోవటంతో వీళ్ళ ముగ్గురు వివేకాపై కక్ష పెంచుకున్నారట. ఎంఎల్సీగా ఓడిపోయిన తర్వాత వైఎస్ షర్మిలను కానీ విజయమ్మను కడప ఎంపీగా పోటీచేయించాలని వివేకా ప్రయత్నించారట. చివరకు షర్మిలను పోటీచేయటానికి ఒప్పించారట. అవినాష్ కు జమ్మలమడుగు ఎంఎల్ఏగా టికెట్ ఇప్పించాలని వివేకా ప్రయత్నించారట.





ఇలాంటి పరిణామాలతోనే కక్ష పెంచుకుని అవినాష్, భాస్కరరెడ్డి  కలిసి వివేకాను హత్య చేయించినట్లు సీబీఐ కౌంటర్లో చెప్పింది. ఇక్కడే కాస్త లాజిక్ తప్పినట్లు అనిపిస్తోంది. ఎవరు ఎక్కడ పోటీచేయాలనే విషయాన్ని డిసైడ్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డే కానీ వివేకానో అవినాషో లేకపోతే భాస్కర్ రెడ్డో కాదు. జగన్ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళక్కడ  పోటీచేయాలంతే. షర్మిలో లేకపోతే విజయమ్మో ఎంపీగా పోటీచేయాలని అనుకుంటే డైరెక్టుగా జగన్నే అడుగుతారు కానీ మధ్యలో వివేకాతో ఎందుకు మాట్లాడుతారు ? అలాగే షర్మిలను కడప ఎంపీగా పోటీచేయించటానికి వివేకా ఒప్పించటం ఏమిటో అర్ధంకావటంలేదు.





అలాగే జమ్మలమడుగులో అవినాష్ కు వివేకా టికెట్ ఇప్పించటం ఏమిటి ? అభ్యర్ధులను ఎంపిక చేసేంత, టికెట్ ఇప్పించేంత సీన్ వివేకాకు ఉందాసలు. జగన్ కు  వివేకాకన్నా అవినాషే సన్నిహితుడని అందరికీ తెలుసు. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చినపుడు  జగన్ వెంట ఉన్నది అవినాషే కానీ వివేకా కాదు. పైగా వైఎస్ ఫ్యామిలీకి వివేకా ఎదురు తిరిగి పులివెందుల ఉపఎన్నికలో విజయమ్మకు వ్యతిరేకంగా పోటీచేశారు. వివేకా హత్యకు ఇంకేదైనా కారణాలుంటే ఉండవచ్చు. అంతేకానీ టికెట్ కు పోటీ వస్తారని హత్య చేయించారంటే నమ్మేట్లుగా లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: