ఎన్నికల నాటికి రాష్ట్రంలోని బీజేపీలోని నేతలను లాగేసుకోవటమే చంద్రబాబునాయుడు అసలు ప్లానట. జగన్ మీడియా చెప్పిన ప్రకారం చంద్రబాబు ఆదేశాల ప్రకారమే బీజేపీలోకి వెళ్ళిన నలుగురు రాజ్యసభ ఎంపీలు ఇపుడిదే పనిలో ఉన్నారట. వీళ్ళకున్న బాధ్యతలు రెండేనట. అవేమిటంటే జనసేన+బీజేపీతో తెలుగుదేశంపార్టీని పొత్తు పెట్టుకునేట్లుగా కమలం అగ్రనేతలను ఒప్పించటం. అలా కుదరకపోతే బీజేపీ నేతలను టీడీపీలోకి పంపటం.





ఈ రెండు టార్గెట్ల ప్రకారమే టీడీపీలో నుండి బీజేపీలోకి వెళ్ళిన  నలుగురు  నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేష్ పనిచేస్తున్నట్లు చెప్పింది. వీరిలో ముగ్గురి రాజ్యసభ పదవీకాలం ముగిసినా ఇంకా బీజేపీలోనే ఎందుకున్నారంటే చంద్రబాబు అప్పగించిన మిషన్ పూర్తిచేయటం కోసమేనట. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే బీజేపీకి మిత్రపక్షంగా టీడీపీని కలుపుకోవాలంటే అంత వీజీకాదు.





ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది స్వయంగా నరేంద్రమోడీ మాత్రమే. ఫిరాయింపు నేతల్లో ఎవరికి కూడా మోడీని ఒప్పించేంత సీన్ లేదని అందరికీ తెలుసు. ఎందుకంటే వీళ్ళలో అందరిపైనా ఆర్ధిక నేరాలకు సంబంధించిన ఆరోపణలున్నాయి. ఇద్దరి ఇళ్ళు, ఆఫీసలుపైన సీబీఐ, ఈడీ, ఐటి విభాగాల ఉన్నతాధికారులు చాలాసార్లు దాడులుచేశారు. రేపో మాపో అరెస్టు ఖాయమన్న సమయంలో టీడీపీలో నుండి బీజేపీలోకి ఫిరాయించేశారు. ఇలాంటి వాళ్ళకు మోడీపై ఒత్తిడి తెచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకునేట్లుగా ఒప్పించేంత సీన్ ఎక్కడుంటుంది ?





అందుకనే రెండో ప్లాన్ ప్రకారం పనిచేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. ఇందులో భాగంగానే ఈమధ్యనే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. తొందరలోనే ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్, వరదాపురం సూరి టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు కూడా అగ్రనేతలపై రెగ్యులర్ గా విమర్శలు చేస్తున్నారు. అంటే ఏదోరోజు రాజు కూడా బీజేపీలో నుండి టీడీపీలోకి వచ్చేయటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. మొత్తానికి బాస్ అప్పగించిన పనిని మాత్రం నలుగురు సక్రమంగా చేస్తున్నట్లే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: